కొడుకు స్లిమ్ సీక్రెట్ చెప్పిన నీతాఅంబానీ

Update: 2018-03-11 04:30 GMT
ఐపీఎల్ అన్నంత‌నే గుర్తుకొచ్చే ప్ర‌ముఖుల్లో అనంత్ అంబానీ ఒక‌రు. భారీకాయంతో స్టేడియంలో కూర్చొని త‌మ జ‌ట్టును ఉత్సాహ‌ప‌రుస్తూ ఉండే అత‌గాడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాడు. దేశంలో అత్యంత సంప‌న్నుడైన ముకేశ్.. నీతా అంబానీ చిన్న‌కొడుకు ఇంత భారీగా ఉండ‌టమా అని అంద‌రూ అనుకునే ప‌రిస్థితి. అలాంటిది ఉన్న‌ట్లుండి అనంత్ క‌నిపించ‌టం మానేయ‌ట‌మే కాదు.. కొద్ది నెల‌ల త‌ర్వాత అత‌గాడు పూర్తిగా మారిపోయి.. స్లిమ్ వెర్ష‌న్ లోకి రావ‌టం అంద‌రిని విప‌రీతంగా ఆక‌ర్షించింది.

అంబానీ కొడుకు క‌దా.. డ‌బ్బులు వెద‌జ‌ల్లి కొవ్వును క‌రిగించేసుకొని ఉంటాడ‌ని కొంద‌రంటే.. ఆ ఏముంది.. శ‌స్త్ర‌చికిత్స‌ల ద్వారా బ‌రువు త‌గ్గి ఉంటాడ‌న్న మాట‌ను య‌థాలాపంగా అనేస్తున్నారు. అయితే.. త‌న కొడుకు స్లిమ్ కావ‌టానికి ప‌డిన క‌ష్టం గురించి తాజాగా నీతా అంబానీ బ‌య‌ట‌పెట్టారు.

క‌ఠిన‌మైన ఆహార నిబంధ‌న‌లు.. అంత‌కు మించిన క‌ష్టంతోనే అనంత్ త‌న బ‌రువును త‌గ్గించుకున్న‌ట్లుగా నీతా వెల్ల‌డించాడు. రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలి హోదాలో శ‌నివారం ముంబ‌యిలో జ‌రిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆమె మాట్లాడారు. డైట్ కంట్రోల్ పాటిస్తూ.. క‌ఠోర శ్ర‌మ‌తో త‌న కొడుకు 118 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్లుగా పేర్కొన్నారు.

క‌ల‌లు క‌న‌టం.. వాటిని సాకారం చేసుకున్న యూత్ స్ఫూర్తిదాయ‌క క‌థ‌నాల్ని చెప్పిన ఆమె.. 2013లో ఐపీఎల్ ట్రోఫీ అందుకునేట‌ప్పుడు అనంత్ బ‌రువు కార‌ణంగా ఇబ్బందిప‌డ్డాడ‌ని.. బ‌రువు త‌గ్గాల‌ని నిర్ణ‌యానికి అదే కార‌ణ‌మైంద‌న్నారు. జామ్ న‌గ‌ర్‌ లో 500 రోజుల పాటు బ‌స చేసి స‌హ‌జ ప‌ద్ధ‌తిలో బ‌రువు త‌గ్గించుకున్నాడ‌న్నారు. బ‌రువు త‌గ్గ‌టంలో భాగంగా రోజూ డైట్ ఛార్ట్ ను పాటిస్తూ.. 23 కిలోమీట‌ర్ల మేర న‌డిచేవాడ‌ని చెప్పారు. త‌న భార్య నీతా అంబానీ వేదిక‌పై స్పీచ్ ఇస్తున్న‌ప్పుడు అప‌ర కుబేరుడైన ముకేశ్ అంబానీ స‌భికుల మ‌ధ్య కూర్చొని ఆస‌క్తిగా విన‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News