రూ.90 కోట్లు కాదు రూ.2వేల కోట్లంట?

Update: 2015-12-09 04:27 GMT
దేశాన్న ఊపేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసు సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆమె పుత్రత్నం..కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై తీవ్రస్థాయిలో  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి.. కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు గాంధీ కుటుంబాలకు కాస్త తక్కువే. అయితే.. దీన్ని బ్రేక్ చేసింది మాత్రం రాజీవ్ హయాంలోనే. ఆయన సతీమణి సోనియా మీద ఇప్పటివరకూ ఆర్థిక అంశాలకు సంబంధించిన ఆరోపణలు లేనప్పటికీ.. తాజా నేషనల్ హెరాల్డ్ విషయంలో మాత్రం వారు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.ఈ కేసుకు సంబంధించి ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని అమ్మా కొడుకులకు పాటియాలా కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో.. వారిద్దరూ ఈ నెల 19న కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. నేషనల్ హెరల్డ్ విషయంపై కాంగ్రెస్ లోక్ సభలో ఆందోళన నిర్వహించటం తెలిసిందే. ఇక.. నేషనల్ హెరాల్డ్ వివాదాన్ని సింపుల్ గా.. మూడుముక్కల్లో చెప్పాల్సి  వస్తే..

నెహ్రూ కాలంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్రికే అయినప్పటికీ.. ఆ పార్టీ తప్పు చేసినా పత్రికలో ఉతికి ఆరేసేవారు. ఈ పత్రికకు 32 ఏళ్ల పాటు సుప్రసిద్ధం జర్నలిస్టు.. తెలుగువాడైన మణికొండ చలపతిరావు.. అలియాస్ ఎంసీ ఈ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరించే వారు. ఇందిర హయాంలో ఆయన నిక్కచ్చి తీరు నచ్చక బయటకు పంపారు. ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ తన పేరు ప్రఖ్యాతుల్ని కోల్పోయింది. అదే సమయంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో పడటంతో దానికి కాంగ్రెస్ పార్టీ రూ.90కోట్లు ఇచ్చింది. 2008లో ఆ పత్రికను మూసేశారు. అయితే.. అసలు వివాదం ఇక్కడే షురూ అయ్యింది. హెరాల్డ్ కి కాంగ్రెస్ పార్టీ రూ.90కోట్లు ఇస్తే.. అప్పుల పాలైన ఆ సంస్థకు చెందిన అప్పుల భారాన్ని తాము మోస్తామని.. కాంగ్రెస్ పార్టీకి రూ.50 లక్షలు ఇస్తూ యంగ్ ఇండియా అంటూ ఒక సంస్థ ముందుకురావటం.. దానికి ఆ బాధ్యత అప్పగించటం చేసేశారు.

ఇంతకీ ఆ యంగ్ ఇండియా ఎవరిదంటే.. అమ్మాకొడుకులదే కావటం అసలు వివాదం. ఆ సంస్థలో 76 శాతం వాటా అమ్మాకొడుకులదే. మిగిలిన వాటాలు కూడా అమ్మకు అత్యంత నమ్మకస్తులైన వారే.

మరో విషయం ఏమిటంటే.. మూతపడే సమయానికి నేషనల్ హెరాల్డ్ కు రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరిన్ని ఆస్తులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసుకున్న రూ.90కోట్లను వెనక్కి ఇచ్చేయొచ్చు. కానీ.. ఇవ్వలేదు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి తీసుకున్న రూ.90కోట్ల అప్పును.. యంగ్ ఇండియా రూ.50లక్షలకు తీసేసుకోవటం.. అదే సమయంలో యంగ్ ఇండియాకు హెరాల్డ్ కు చెంది రూ.10 ముఖ విలువ కలిగిన 9 కోట్ల షేర్లను ఇవ్వనున్నట్లు 2010లో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని పెట్టి హెరాల్డ్ తీర్మానం చేసింది.

ఈ తీర్మానంతో హెరాల్డ్ కు చెందిన 99శాతం షేర్లు యంగ్ ఇండియా చేతికి చేరిపోయాయి. అంటే.. రూ.2వేల కోట్ల ఆస్తులు సింఫుల్ గా రూ.50లక్షలతో అమ్మాకొడుకులకు చెందిన యంగ్ ఇండియాకు దఖలు పడ్డాయన్న మాట. అమ్మా..కొడుకుల ఐడియా అదిరిపోయింది కదూ..?
Tags:    

Similar News