ఆ త‌ల్లి, కొడుకులు ఇండియాకు వ‌చ్చేశారు

Update: 2017-03-25 04:35 GMT
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ - ఆమె త‌న‌యుడు-పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ ఇండియాకు తిరిగి వ‌చ్చారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సోనియా గాంధీ త‌న‌ కుమారుడు రాహుల్ తో కలిసి పూర్తి ఆరోగ్యంతో ఆమె స్వదేశం చేరుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 70 ఏళ్ల సోనియాగాంధీ ఈనెల మొదటి వారంలో అమెరికా వెళ్లారు. మామూలు ఆరోగ్యపరీక్షల నిమిత్తమే ఆమె అక్కడకి వెళ్లారని పార్టీ నేత‌లు తెలిపారు. కొద్ది రోజుల విశ్రాంతి త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా పంజాబ్‌ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంత‌రం ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న   కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తరువాత ఈనెల 16న తల్లి దగ్గరకు వెళ్లారు. అయితే ఆయ‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను అధికారికంగా వెళ్ల‌డించ‌లేదు. కాగా, లోక్‌ సభ ఎన్నికల తరువాత జరిగిన వరుస ఎన్నికల్లో పరాజయం, ముఖ్యంగా యూపీలో ఘోర ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్‌ లో సంస్థాగత మార్పులు తప్పవని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కొద్దికాలం క్రితం ప్రకటించారు. స్వదేశం తిరిగొచ్చిన సోనియా - రాహుల్‌ లు ఇప్పుడు దానిపైనే దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలోనే కొందరు పార్టీ నాయకులు రాహుల్‌ ను కలవడం గమనార్హం. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత కొన్ని నెలలుగా రాహులే పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మ‌రోవైపు సోనియా చాలా ఏళ్ల తరువాత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News