అసహనం పై కాంగ్రెస్ మార్క్ రాజకీయం

Update: 2015-11-03 04:45 GMT
‘‘మత అసహనం’’పై మేధావులు.. సెలబ్రిటీల అసహనం ఇప్పుడు రాజకీయంగా మారనుంది. దేశంలో ‘‘మత అసహనం’’ పెరిగిపోతుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలన్న నినాదంతో కాంగ్రెస్ తన రాజకీయాల్ని షురూ చేస్తోంది. ఇప్పటివరకూ దేశంలోని పరిస్థితులపై మేధావులు.. కళాకారులు.. సినిమా రంగానికి చెందిన వారు తప్పు పడుతూ.. గతంలో ప్రభుత్వాలు తమకు ఇచ్చిన పురస్కారాల్ని తిరిగి ఇవ్వటం.. ఇస్తానని ప్రకటించటం తెలిసిందే.

తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టింది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రపతి ప్రణబ్ ను కలవటం.. దాన్ని మర్యాదపూర్వక భేటీ పేర్కొన్నారు. నేడు.. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీగా తరలివెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. దేశంలో పెరుగుతున్న అసహనం.. హింస.. ప్రజల మధ్య మతపరమైన విభజనతో కూడిన వాతావరణానికి ముగింపు పలకటానికి రాష్ట్రపతి తనకున్న అధికారాల్ని ఉపయోగించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కోరనున్నారు.

మత అసహనం మీద ఇంతకాలం వ్యూహాత్మక మౌనాన్ని వహించి.. సమయం చూసుకొని కాంగ్రెస్ రంగంలోకి దిగినట్లుగా విమర్శలు ఉన్నాయి. మత అసహనంపై ఇంతకాలం మాట్లాడకుండా ఉన్న వారు.. ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేయటం వెనుక.. ‘‘రాజకీయం’’ ఉందన్న మాట వినిపిస్తోంది.

మత అసహనంపై మొదటే మాట్లాడితే రాజకీయ రంగు పులుముకొని దానికి ప్రాధాన్యత ఉండదని.. అందుకే తనకు అనుకూలమైన వర్గాలతోమత అసహనంపై ఆందోళనలు చేయించి.. వాటికి విపరీతమైన ప్రచారం లభించేలా జాగ్రత్తలు తీసుకొని.. ఈ అంశంపై దేశంలో తీవ్ర చర్చ జరిగే సమయంలో తాను ఎంట్రీ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహానికి తగ్గట్లే తాజా పరిణామాలు అని విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. ఏమైనా దేశంలోని మత అసహనం అంశంపై కొన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్ ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు తెర తీస్తుందన్నది ఇప్పుడు ప్రవ్నగా మారింది.
Tags:    

Similar News