ఏపీకి ప్రత్యేక హోదా కోసం అమ్మ పోరాడతారట

Update: 2016-03-16 06:32 GMT
చేయాల్సిందంతా చేసేసి.. తీరుబడిగా స్పందించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. విభజన కారణంగా నానా ఇబ్బందులు ఎదురవుతాయని.. ఏపీకి అమితంగా నష్టపోతుందని ఏపీ నేతలు నెత్తినోరూ కొట్టుకున్నా పట్టించుకోని సోనియమ్మ.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గళం విప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు సేకరించిన కోటి సంతకాలు.. అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టిని సోనియాకు అందించిన కాంగ్రెస్ నేతలు ఆమె ద్వారా వాటిని ప్రధానికి పంపాలని భావిస్తున్నారు.

తాము సేకరించిన కోటి సంతకాల్ని సోనియమ్మ చేతికి అందజేసిన ఏపీ నేతల్ని ఉద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ అధినేత్రి.. ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల్ని సేకరించటం అభినందనీయం అంటూ ఏపీ కాంగ్రెస్ నేతల్ని సోనియమ్మ ప్రశంసించారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేసే వరకూ కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్న ఆమె.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం.. పోలవరం ప్రాజెక్టు అంశాలపై పోరాడతామని చెప్పారు.

సోనియాతో పాటు.. ఆమె తనయుడు.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఏపీకి న్యాయం జరిగే వరకూ పోరాడతామని.. గుప్పెడు మట్టి.. చెంబుడు నీళ్లు ఇచ్చి ఏపీని ప్రధాని మోడీ మోసం చేశారని మండిపడ్డారు. విభజన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన రాహుల్.. ప్రధాని మోడీ మీద ఒత్తిడి తెస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలు చేసేలా మోడీ సర్కారుపై కాంగ్రెస్ ఒంటరిగా పోరాడుతుందని చెప్పిన రాహుల్.. విభజన సమయంలోనే జాగ్రత్తలు తీసుకొని పక్కాగా వ్యవహరించి ఉంటే.. ఈ తిప్పలు తప్పేవి కదా? చేయాల్సిన నష్టమంతా చేసేసి..ఈ రోజున ఏపీకి ఏదో చేసేస్తామని చెబుతున్న సోనియా.. రాహుల్ కు ఒకటే ఒక్క సూటిప్రశ్న. హామీల సాధన కోసం గడిచిన 22 నెలల నుంచి ఎందుకు బలంగా గళం విప్పలేదు..?
Tags:    

Similar News