డిగ్గీకి సోనియమ్మ ఓ రేంజ్ క్లాస్

Update: 2016-03-11 04:47 GMT
అమ్మకు చురుకు పుట్టింది. తెలుగు నేలను రెండు ముక్కలు చేస్తేనే చాలు.. శాశ్వితంగా కాంగ్రెస్ జెండా ఢిల్లీ కోట మీద ఎగురుతుందంటూ ఉదరగొట్టేసి.. ముక్కలు చేసేవరకు నిద్రపోని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎక్కడా అంటూ కస్సుమంటున్నారట. ఒకటి తర్వాత ఒకటిగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ అమ్మను షేక్ చేస్తోందని చెబుతున్నారు. తెలంగాణ  రాష్ట్రం ఇస్తే చాలు.. మొత్తంగా కాంగ్రెస్ కథే మారిపోతుందన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు అసలు అర్థం తెలిసి అగ్గి మీద గుగ్గిలం కావటమ కాదు.. ఒకరి తర్వాత ఒకరుగా తెలంగాణ అధికారపక్షం దిశగా వెళుతున్న వైనాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారట.

తాజాగా.. డిగ్గీరాజాను పిలిపించుకున్న అమ్మ.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితికి సంబంధించి తలంటినట్లుగా తెలుస్తోంది. ఏపీ గురించి ఆమె పెద్దగా మాట్లాడకున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీనస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఏం జరుగుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని చెప్పటంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకుంటే ఢిల్లీ కోటను చేజిక్కించుకోవటం ఎంత కష్టమన్న విషయం తెలీదా? అని సూటిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకూ ఢిల్లీలో పాగా వేయటానికి కారణం తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలేనని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పిన సోనియమ్మ.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకదశలో తెలంగాణ కాంగ్రెస్ ఉంటుందా? కనిపించకుండా పోతుందా? అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోనియమ్మ తీరు చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. మొత్తం కాలిపోయాక.. అంతా అయిపోయాక తీరిగ్గా నిద్ర లేచిన చందంగా.. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఇప్పుడు స్పందించటం ఏమిటీ కామెడీ కాకపోతే..?
Tags:    

Similar News