అమెరికన్ ఫార్ములాపై సోనియా మనసు..

Update: 2016-06-11 08:15 GMT
భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీనావస్థలో ఉందన్న సంగతి తెలిసిందే. పార్టీ పెద్దలు బలహీనులు కావడం.. చేతికందిన కొత్తతరం చేతకాకుండా మిగిలిపోవడంతో పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పార్టీ పెద్ద సోనియాగాంధీ తన అనుభవాన్నంతా ఉపయోగించి... ప్రపంచ దేశాల్లోని రాజకీయ పోకడలను గమనిస్తూ సరికొత్త నిర్ణయంతీసుకున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా మదిలో మెదులుతున్న ఆలోచనకు ఆమోదం పలికినట్లుగా అనుకుంటున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తిరుగులేని ప్రజాదరణ ఉన్న హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో్ సోనియా ఆ విషయాన్ని భారత్ లో కాంగ్రెస్ పార్టీకి వర్తింపజేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
    
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సోనియా పెద్ద దిక్కు కాగా ఆమె తనయుడు రాహుల్ గాంధీ ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ... రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు - బీజేపీ స్టాల్ వార్ట్సు ముందు రాహుల్ సమర్థంగా నిలబడలేకపోతున్నారు. ఈ క్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజురోజుకూ దిగజారుతుందే కానీ ఏమాత్రం మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో కొంతకాలంగా కొత్త డిమాండ్ వినిపిస్తోంది. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్లు చాలాకాలంగా కోరుతున్నారు. అయితే.. ప్రియాంక అందుకు ససేమిరా అంటున్నారు.
    
ఇందిరాగాంధీ పోలికలతో ప్రజల్లో మంచి ఛరిష్మా ఉన్న ప్రియాంక పట్ల కాంగ్రెస్ పార్టీలో చాలా ఆశలున్నాయి. ఆమెను తీసుకొస్తే పార్టీకి పునర్వైభవం రావడం ఖాయమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. వారాంతా చాలాకాలంగా రాహుల్ ను చూస్తూ ఇక ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బతికి బట్టడం కష్టమేనని కూడా అనుకుంటున్నారు. క్రమంగా సోనియా పై వారు ఒత్తిడి తెస్తున్నా ఆమె ఇంకా కొడుకుపై ఆశతో ఇంతకాలం ప్రియాంకను రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. కేవలం సోనియా - రాహుల్ లు పోటీ చేసినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం చేస్తుందే కానీ మిగతా ఇంకెక్కడా చేయదు. కానీ... సోనియా ఇప్పుడు మనసు మార్చుకుని ప్రియాంక విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
    
ఇందిరా గాంధీ మనవరాలిగా.. ఆమె పోలికలతో ఉండే ప్రియాంకా గాంధీని  రాజకీయాల్లోకి తెస్తే ఫలితముంటుందని ఆమె నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాది దేశంలో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా అధికార బీజేపీ భావిస్తోంది. సాధ్యమైనన్ని సీట్లు సాధించడమే కాకుండా ఆ రాష్ట్ర అధికార పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు కమల దళం వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు యూపీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంకను రంగంలోకి దించుతారని తెలుస్తోంది.  యూపీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకునేలా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.  2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమేనన్న ప్రచారమూ సాగుతోంది.
Tags:    

Similar News