సోనియా విందుకు హాజ‌రైన పార్టీల లిస్ట్ పెద్ద‌దే!

Update: 2018-03-14 05:06 GMT
కాంగ్రెస్ మాజీ ర‌థ‌సార‌ధి సోనియాగాంధీ రాజ‌కీయ విందు ముగిసింది. థ‌ర్డ్ ప్రంట్ ప్ర‌క‌ట‌న‌తో జాతీయ రాజ‌కీయాల్లో ఒక్క‌సారి ఉలికిపాటుకు గురి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుణ్య‌మా అని కాంగ్రెస్ లో క‌ద‌లిక వ‌చ్చింది. బీజేపీ.. కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ కేసీఆర్ భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వటం.. అందుకు స్పంద‌న‌గా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సానుకూలంగా రియాక్ట్ కావ‌టంతో థ‌ర్డ్ ఫ్రంట్ మీద కొత్త చ‌ర్చ మొద‌లైంది.

త‌న ప్ర‌క‌ట‌న‌కు భారీ స్పంద‌న వ‌స్తోంద‌ని.. త్వ‌ర‌లో తాను దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్న‌ట్లుగా కేసీఆర్ చెబుతున్న వేళ‌.. సోనియాగాంధీరంగంలోకి దిగి త‌న బ‌లం ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌కీయాలు మాట్లాడ‌టానికి కాదంటూ.. రాజ‌కీయ పార్టీల‌తో విందు స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీఏ కూట‌మి బ‌లంగా ఉండ‌టంతో పాటు బీజేపీకి అస‌లుసిస‌లు ప్ర‌త్యామ్న‌యం అన్న‌ట్లుగా తాజా విందు స‌మావేశం సాగింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

రాజ‌కీయాల కోసం కాదు.. స్నేహ‌పూర్వ‌కంగా విందును ఏర్పాటు చేసిన‌ట్లుగా కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంతో పాటు.. యూపీఏ ప‌క్షంగా ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. విందులో భాగంగా అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యంపై అస్ప‌ష్ట‌త ఉన్న‌ప్ప‌టికీ.. విందుకు వెళ్లిన పార్టీల లిస్ట్ చూస్తే.. భారీగా ఉంద‌ని చెప్పాలి. రోజురోజుకి కాంగ్రెస్ ప్రాభ‌వం త‌గ్గిపోతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. సోనియా నిర్వ‌హించిన విందుకు 19 విప‌క్ష పార్టీ నేత‌లు హాజ‌రు కావ‌టం గ‌మ‌నార్హం.

దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్లు.. వేలాది కోట్ల రూపాయిలు దేశం దాటి వెళిపోతున్న వైనంపై డిన్న‌ర్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తో కేసీఆర్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. అంత‌క‌మంటే ముందే యూపీఏ భాగ‌స్వామ్య‌ప‌క్షాల‌తో పాటు..కాంగ్రెస్ బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించే ప‌నిలో భాగంగా తాజా స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు.

సోనియా విందు స‌మావేశానికి హాజ‌రైన పార్టీల జాబితా చూస్తే భారీగానే ఉంద‌ని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు మ‌న్మోహ‌న్ సింగ్‌.. గులాం న‌బీ అజాద్‌.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. అహ్మ‌ద్ ప‌టేల్‌.. ఏకే ఆంటోనీతో పాటు ప‌లువురు ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు. మొత్తం 19 పార్టీల్లో 18 మందిపై స్ప‌ష్ట‌త రాగా.. మ‌రో పార్టీ నేత‌పై స్ప‌ష్ట‌త రాలేదు. వివిధ పార్టీ నేత‌ల విష‌యానికి వ‌స్తే..

1. శరద్‌ పవార్‌ (ఎన్సీపీ)

2. శరద్‌ యాదవ్‌ (జేడీయూ బహిష్కృత నేత)

3. అజిత్‌ సింగ్‌ (ఆర్‌ ఎల్‌ డీ)

4. రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (సమాజ్‌ వాదీ పార్టీ)

5. సతీశ్‌ చంద్ర మిశ్రా (బీఎస్ ఎఫ్‌)

6. ఒమర్‌అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌)

7. బాబూ లాల్‌ మరాండీ (ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా-ప్రజాతంత్రిక్‌)

8. హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా)

9. జితన్‌రామ్‌ మాంఝీ (హిందుస్థానీ అవామ్‌ మోర్చా)

10. తేజస్వి యాదవ్‌ - మీసాభారతి (లాలూ ప్రసాద్‌ యాదవ్ కొడుకు.. కుమార్తె -ఆర్జేడీ)

11. సుదీప్‌ బందోపాధ్యాయ (టీఎంసీ)

12. డి.రాజా (సీపీఐ)

13. మహ్మద్‌ సలీం (సీపీఎం)

14. కనిమొళి (డీఎంకే)

15. బద్రుద్దీన్‌ అజ్మల్‌ (ఏఐయూడీఎఫ్‌)

16. కుపేందర్‌రెడ్డి (జేడీ-ఎస్‌)

17. కున్హాలి కుట్టి (ఐయూఎంఎల్‌)

18. ఎన్‌కే ప్రేమచంద్రన్‌ (రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ)
Tags:    

Similar News