ఓవైపు ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న తరుణంలో ఢిల్లీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ప్రత్యేక హోదా ప్రియులకు టార్గెట్ గా మారిన బీజేపీని ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఇరకాటంలో పడేసేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక్క తాటిపైకి చేర్చేందుకు సిద్ధమవగా...ఇందులో ఆశ్చర్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. ఈ భేటీకి బాబు హాజరవుతారా? లేదా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యం లో బీజేపీ, కాంగ్రెసేతర కూటములు అనే అంశాలు తెరపైకి వచ్చాయి. పార్లమెంటులో వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్న తరుణంలో 2019 లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ప్రతిపక్షాన్ని మరింత పటిష్టం చేసేందుకు, ఐక్య కూటమికి అంకురార్పణ చేసేందుకుగాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఓ ముందడుగు వేశారు. విపక్ష పార్టీలకు ఈనెల 13న విందు ఇవ్వనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమిని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే సోనియా ఈ విందును ఏర్పా టు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అన్ని పార్టీల నాయకులను ఆమె ఆహ్వానించారు. ఇలాంటి తరుణంలోనే సోనియా నుంచి ప్రతిపక్షాలకు విందుకు ఆహ్వానాలు అందడం గమనార్హం. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉండటం విశేషం.
సోనియా విందుతో పార్లమెంటు బయట, లోపల బిజెపిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక చోట చేరుతున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. ‘ఇది కేవలం విందు మాత్రమే కాదు, బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఐక్య కూటమిగా ఏర్పడేందుకు ఆసక్తి చూపే పార్టీలన్నీ ఒక చోట చేరే వేదిక’ అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఆహ్వానాలు అందుకున్న వారంతా విందుకు హాజరవుతారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సహా ప్రతిపక్ష నాయకులతో కలిసేందుకు సోనియా గాంధీ ఎంతో ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగే చంద్రబాబు ఈ భేటీకి వెళతారా అనేది సందేహమే అంటున్నారు.