ద‌ళిత బాణాన్ని తీయ‌నున్న సోనియ‌మ్మ‌!

Update: 2017-06-20 07:37 GMT
ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. వ‌జ్రాన్ని వ‌జ్రంలోనే కోయాల‌న్న మాట తెలిసిందే. తాజాగా మోడీ మార్క్ రాజ‌కీయాల‌కు ఆయ‌న‌కు త‌గిన‌ట్లే చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ డిసైడ్ అయ్యార‌ని చెబుతున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించి ఏకాభిప్రాయం పేరుతో ద‌ళిత కార్డును బ‌య‌ట‌కు తీసి విప‌క్షాల‌కు ఊహించ‌ని షాకిచ్చిన మోడీకి.. అదే త‌ర‌హాలో జ‌వాబు చెప్పాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

రాష్ట్రప‌తి లాంటి అత్యున్న‌త ప‌ద‌వికి పోటీ లేకుండా ఎన్నుకోవాల‌న్న మాట‌ను తెర మీద‌కు తెచ్చిన బీజేపీ.. ఊహించ‌ని రీతిలో ద‌ళితుడైన నేత‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా తెర మీద‌కు తీసుకొచ్చిన నేప‌థ్యంలో.. కాంగ్రెస్ అండ్ కోలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఏకాభిప్రాయం పేరిట చ‌ర్చ‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలో చెప్పిన మాట‌ల‌కు సంబంధం లేని రీతిలో ద‌ళిత నేత‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం ద్వారా రాజ‌కీయంగా త‌మ‌ను దెబ్బ తీయాల‌న్న ఆలోచ‌న చేసిన మోడీ అండ్ కోపై విప‌క్షాలు ఆగ్ర‌హంతో ఉన్నాయి.

దీంతో.. మోడీ ప‌రివారం చెబుతున్న ఏకాభిప్రాయం మాట‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని.. విప‌క్షాల‌న్నీ క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ద‌ళిత నేత‌ను తీసుకొచ్చిన బీజేపీకి ఝుల‌క్ ఇచ్చేలా మ‌రో ద‌ళిత అభ్య‌ర్థిని రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో కాంగ్రెస్ అండ్ కో పార్టీలు ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌తంలో కేంద్ర‌మంత్రిగా ప‌ని చేసిన సుశీల్ కుమార్ షిండే కానీ.. లోక్ స‌భ స్పీక‌ర్ గా ప‌ని చేసిన మీరాకుమార్‌ ల‌లో ఎవ‌రో ఒక‌రిని కాంగ్రెస్ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. తాజా వాద‌న‌ల‌పై షిండే మాత్రం నిజం కాద‌ని కొట్టిపారేస్తున్నారు. తాను బ‌రిలోకి దిగేది అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రి కాంగ్రెస్ నేత‌ల వాద‌న ప్ర‌కారం.. ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన పేర్లు కాకున్నా.. కొత్త పేరు రావొచ్చ‌ని.. కానీ ద‌ళిత అభ్య‌ర్థినే కాంగ్రెస్ తెర మీద‌కు తెచ్చే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News