గవర్నర్ కు ‘‘అమ్మ’’ నుంచి ఫోన్ కాల్

Update: 2016-02-05 04:26 GMT
రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ సుడే సుడిగా పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ జమానాలో గవర్నర్ గా అయి.. మోడీ సర్కారులోనూ విజయవంతంగా బండి నడుపుతున్న అతికొద్ది మందిలో నరసింహన్ ఒకరు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నర్లను కొనసాగేందుకు మోడీ సర్కారు ఓకే అన్నా.. నరసింహన్ కు ఇచ్చిన ప్రాధాన్యత మిగిలిన వారి కంటే కాస్త భిన్నమైందని చెప్పాలి. తనకు గవర్నర్ గిరి ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇన్నాళ్లకు నరసింహన్ కు కలిగిందని చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పాతబస్తీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీనియర్ నేత షబ్బీర్ అలీని మధ్యాహ్నం వేళ.. రోడ్డు మీద.. అందరూ చూస్తున్నవేళ.. కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు స్పందించిన తీరుపై కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా ఉంది.

ఈ ఘటన తర్వాత కాంగ్రెస్ సహా.. తెలంగాణ విపక్షాలన్నీ హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేయటం తెలిసిందే. తమ డిమాండ్ ను అమలు చేయాలని కోరుతూ వారు గవర్నర్ నరసింహన్ ను కోరటం జరిగింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి గవర్నర్ నరసింహన్ కు ఫోన్ వెళ్లినట్లు చెబుతున్నారు. అమ్మకు అత్యంత నమ్మకమైన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వెళ్లటం.. పాతబస్తీ ఇష్యూ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని.. ఈ ఘటన మీద తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు ఏ మాత్రం సరిగా లేదని.. దీనిపై చర్యలేమిటన్న విషయాన్ని నేరుగా అడిగేసినట్లు తెలుస్తోంది.

‘అమ్మ’ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో రియాక్ట్ అయిన గవర్నర్.. పాతబస్తీ ఘటనపై హైదరాబాద్ సీపీతో మాట్లాడటంతో పాటు.. డీసీపీ మార్పుపై సూచన చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ నుంచి వచ్చిన మాటతో కదిలిన యంత్రాంగం డీసీపీని మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లకు తనను అపాయింట్ చేసిన అమ్మ పట్ల తనకున్న విదేయతను తాజా ఎపిసోడ్ లో నరసింహన్ ప్రదర్శించారని చెప్పొచ్చు.
Tags:    

Similar News