5 నిమిషాల్లో బయటకొచ్చిన సోనియా

Update: 2015-12-19 10:48 GMT
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురికీ పాటియాలా కోర్టు నేడు బెయిల్‌ మంజూరు చేసింది. 50 వేల రూపాయిల చొప్పున పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించింది. కేసులో ఉన్న ముఖ్య నేతలు సోనియా - రాహుల్‌ గాంధీలకు అదనంగా మరొక వ్యక్తి పూచీకత్తు కూడా ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సోనియా గాంధీకి ఎ.కె. ఆంటొనీ పూచీకత్తు ఇచ్చారు. రాహుల్‌ కు ఆయన సోదరి ప్రియాంక పూచీకత్తు ఇచ్చారు. ఈ కేసును కాంగ్రెస్‌ నేత - ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదించారు.  కేసును కోర్టు ఫిబ్రవరి 20 తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కేసు విచారణకు వస్తుంది. సోనియా - రాహుల్‌ గాంధీలు ఆ రోజు కోర్టుకు హాజరవుతారని, వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కోరలేదని కేసు వాదించిన కపిల్‌ సిబాల్‌ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంపిట్రోడాకు మాత్రం వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపునిచ్చారు.

కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేవలం 5 నిమిషాలు మాత్రమే న్యాయస్థానంలో ఉన్నారు.  వాదనలు అయిదు నిమిషాల్లోనే ముగిశాయి.  విచారణ సందర్భంగా కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. కాగా సోనియా కుమార్తె ప్రియాంకా వాద్రా - అల్లుడు రాబర్ట్ వాద్రాలు సోనియా కంటే ముందుగానే కోర్టుకు వచ్చారు.  మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ - మాజీ స్పీకర్ మీరా కుమార్ - లోక్‌ సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే - సీనియర్ నేతలు అహ్మద్ పటేల్ - అభిషేక్ మను సింఘ్వీ - కపిల్ సిబల్ సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలుతో పాటు పార్టీ శ్రేణులు  కూడా పటియాలా హౌజ్ కోర్టుకు తరలి వచ్చారు.
Tags:    

Similar News