సోనియా.. పీకే.. వ‌రుస భేటీలు.. వ్యూహాలు మారుతున్నాయా?

Update: 2022-04-19 10:30 GMT
జాతీయ రాజ‌కీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును ప‌క్క‌న పెట్టి తాము జెండా ఎగ‌రేయాల‌ని.. భావిస్తున్న కాంగ్రెస్ ఈ క్ర‌మంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకేను పార్టీలో చేర్చుకునేందుకు నిర్ణయించుకుంది. దీనికి త‌గిన ముహూర్తం కూడా చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కాంగ్రెస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌క్ష్యాల‌ను కూడా పీకే నిర్ణ‌యించారు. 370 నుంచి 400 స్థానాలు ల‌క్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగాల‌ని ఆయ‌న నిర్దేశించారు.

అయితే..ఈ లోగానే సోనియాతో పీకే వ‌రుస భేటీలు.. ఆస‌క్తిగా మారాయి. ఒక‌వైపు ప్రాంతీయ పార్టీల కూట‌ములు రెడీ అవుతున్న‌నేప‌థ్యంలో మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా .. మ‌రింత పుంజుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుండ‌డం జాతీయ రాజ‌కీయాల్లో పెను మార్పులు తీసుకురావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా మ‌హారాష్ట్ర‌కు చెందిన‌ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్లు ప్ర‌క‌టించారు.

ఈ నేప‌త్యంలో కాంగ్రెస్ మ‌రింత‌గా త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది.  పార్టీని బలోపేతం చేసి 2024 ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా సోనియా గాంధీ పావులు కదుపుతున్నారు.  ఈనేపథ్యంలోనే సోనియా,  పీకేతో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. శనివారం(ఏప్రిల్ 16న) కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. ఆ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై తాను రచించిన ప్రణాళికలను పార్టీ నేతలతో పంచుకున్నారు. అదే సమయంలో తాను కాంగ్రెస్ లో చేరే అంశాన్ని కూడా సీనియర్ నాయకుల వద్ద ప్రస్తావించారు.

దీంతో మ‌ళ్లీ వారం ప‌ది రోజుల వ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి మీటింగు ఉండ‌ద‌ని అనుకున్న త‌రుణంగా.. అనూహ్యంగా సోమవారం (ఏప్రిల్ 18) సోనియా ఆధ్వర్యంలో మరోసారి పార్టీ సినియర్ క్యాడర్ తో భేటీ జ‌రిగింది. దీనికి కూడా పీకే వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, పి చిదంబరం, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు హాజరయ్యారు.

నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో రానున్న ఎన్నికల వ్యూహంలోని వివిధ కోణాలపై నేతలు చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిషోర్, ముందుగా పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను బరిలో దించాలని ప్రతిపాదించారు. తద్వారా ఆయా అభ్యర్థులు గెలిస్తే ఆ విజయం తాలూకు ప్రభావం ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్ గతానికి భిన్నంగా దూసుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News