సోనియమ్మ మీద 1.5లక్షల కోట్ల బాంబేసినస్వామి

Update: 2015-11-19 14:16 GMT
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి అలాంటి ఇలాంటి వాడు కాదు. తమిళుడిగా సుపరిచితమైన ఇతను.. తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆరోపణలు.. విమర్శలు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి తర్వాతే ఎవరైనా. ఆయన ఏ రోజు ఏ ఆరోపణ చేసినా అదో సంచలనంగా మారుతుంది.

దీనికి తోడు.. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే.. గతంలో ఆయన వెలుగులోకి తెచ్చిన పలు కుంభకోణాలు దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. అలాంటి సుబ్రమణ్యస్వామి నోటి నుంచి ఏదైనా మాట వస్తే.. ఆ మాటల్నికాస్తంత ఆసక్తితో వినటం ఒక అలవాటుగా మారింది. కానీ.. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న విమర్శలు.. ఆరోపణల్లో పస ఉండటం లేదు.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయుడు కాదని.. ఆయన బ్రిటీషర్ అంటూ కొన్ని కాగితాల్ని చేతులో పట్టుకొని.. మీడియా వారికి ఇచ్చి ఆరోపణలు చేసినా విషయం పెద్దగా వేడెక్కలేదు. ఎప్పుడూ లేని విధంగా.. రాహుల్ గాంధీ సైతం తాజాగా సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలపై రియాక్ట్ అవుతూ.. తన మీద చేసిన ఆరోపణల్ని కానీ నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరిన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె విదేశీ ఖాతాల్లో దాదాపుగా రూ.1.5లక్షల కోట్లు ఉన్నట్లుగా ఆరోపించారు. సోనియాకు చెందిన విదేశీ బ్యాంకుల ఖాతాల్లో ఈ భారీ మొత్తం ఉందన్నారు. సోనియా అకౌంట్లో ఇంత భారీ మొత్తం డబ్బు ఉన్నట్లుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెకట్రేట్ కు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బ్రిటీషర్ అంటూ చేసిన ఆరోపణ మాదిరే.. సోనియాగాంధీ మీద చేసిన ఆరోపణ కూడా తేలిపోతుందా? లేక.. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆసక్తికర ఆధారాల్ని స్వామి ఏమైనా చూపిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News