ఢిల్లీ సీఎంతో సోనూసూద్ భేటి.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!

Update: 2021-08-27 06:30 GMT
కరోనా కల్లోలంలో అందరికీ సాయం చేసి రియల్ హీరోగా మారాడు ప్రముఖ నటుడు సోనూ సూద్. తాజాగా సోనూసూద్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సోనూ సూద్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని ఆయన పుచ్చుకోనున్నారా? వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ గా పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలు బోలెడు వచ్చాయి.

కరోనా లాక్ డౌన్ వేళ ఎంతో మందిని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకొని సోనూసూద్ ఆపద్భాంధవుడిగా మారాడు. సొంత డబ్బులు, విరాళాలతో పనులు చేస్తున్న సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేయగలరని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని లక్షలాది మంది అభిమానులు కోరుతున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటి అయ్యారు సోనూ సూద్. వీరిద్దరి భేటి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ ప్రభుత్వం దేశ్ కే మెంటర్స్ ప్రోగ్రామ్ ను త్వరలోనే లాంచ్ చేయబోతోంది. దానికి సోనూసూద్ ను బ్రాండ్ గా నియమించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

లక్షలాది మంది విద్యార్థులకు మెంటర్ గా వ్యవహరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని సోనూసూద్ ప్రకటించారు.  తాను ఢిల్లీ ప్రభుత్వం ‘దేశ్ కే మెంటర్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో భాగంగా 10 లక్షలమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మార్గ నిర్ధేశం చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.

సోనూసూద్ రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిఅసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంజాబ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ బలోపేతంపై అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. గురువారం పంజాబ్ లో పర్యటించారు.  ఈ నేపథ్యంలోనే సీఎం కేజ్రీవాల్ తో సోనూసూద్ భేటి కావడం చర్చనీయాంశమైంది.

సోనూసూద్ స్వరాష్ట్రం పంజాబ్. మోగా పట్టణంలో సోనూసూద్ పుట్టి పెరిగారు. సోనుసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే పంజాబ్ లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం ఉంది. అందుకే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారట..
Tags:    

Similar News