ఆరోగ్యరంగంలో మోడీ ప్రభుత్వం ఫెయిలైందా?

Update: 2021-04-20 11:54 GMT
కరోనా ఒకసారి కొట్టిన దెబ్బ ఇంకా పచ్చిగానే ఉంది. అందరికీ గుర్తిండే ఉంటుంది. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చిన మొదటి కరోనా వేవ్ దేశంలో మార్చికి వచ్చేసరికి విస్తరించి లాక్ డౌన్ విధించేదాకా వెళ్లింది. వేలు, లక్షల కేసులు నమోదై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కిక్కిరిసి రోగులు హాహాకారాలు చేశారు. అప్పుడే వైద్యరంగం అతలాకుతలమైంది. పీపీఈ కిట్స్, మాస్కుల కొరతతో దేశం అల్లకల్లోలమైంది.  అప్పుడు కోల్పోయిన ఉద్యోగ, ఉపాధితో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. జనాలు డబ్బుల్లేక నానా అగచాట్లు పడ్డారు.  ఇప్పటికీ ఉద్యోగాలు గాడినపడలేదు. అందరికీ సక్రమంగా జీతాలు రావడం లేదు.

మొదటి కరోనా కల్లోలం ఒక గుణపాఠం. అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా ఇప్పటికీ కోలుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడడం లేదు. అంత దారుణమైన అనుభవాల తర్వాత ఇప్పుడు దేశంలో రెండో వేవ్ వచ్చింది. మొదటి దానికి మించి కేసులు, రోగులు, మరణాలు పెరుగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. అంతే స్థాయి వైద్యం అథమ స్థాయిలో ఉంది. మొదటి సారియే జాగ్రత్త పడితే దేశంలో ఇప్పుడు ఇంత దుర్లభమైన స్థితి ఉండేది కాదని సినీ, రాజకీయ, మేధావి వర్గాల అంతా ఇప్పుడు మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చిందని చేతులు దులుపుకొని పక్కదేశాలకు పంచేసి మోడీ హీరో అయిపోగా.. వ్యాక్సిన్లు అందక సెకండ్ వేవ్ కు బలవుతున్న దేశ ప్రజలను ఓదార్చేవారు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తోంది. మొత్తం ఈ రెండో వేవ్ వరకుకూడా దేశ వైద్యరంగాన్ని బాగు చేయని మోడీ సర్కార్ వైపు ఇప్పుడు అందరి వేళ్లు వెలుతున్నాయి. ప్రశ్నిస్తున్నాయి. తాజాగా దేశంలో వైద్యరంగం దుస్థితి చూసి ఎంతో మందికి సాయం చేసిన నటుడు సోనూ సూద్ సైతం తీవ్ర ఆవేదన చెందడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కరోనా కల్లోలం వేళ మనం అందరం విఫలమయ్యామని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆరోగ్య రంగంపై తాజాగా ప్రముఖ నటుడు సోనూ తీవ్ర  అసహనాన్ని వ్యక్తం చేశాడు. కరోనా సెకండ్ వేవ్ వేళ దేశంలో బెడ్స్ దొరకడం లేదని.. కనీసం మందులు కూడా అందుబాటులో లేవని సోనూ సూద్ వాపోయారు.

తనకు ఆస్పత్రుల్లో బెడ్స్ ఇప్పించాలని 570 అభ్యర్థనలు వచ్చాయని.. కానీ తాను కేవలం 112 మాత్రమే అందించానని సోనూసూద్ ట్వీట్ చేశాడు. ఇక రెమిడెసివర్ ఔషధం కోసం 1477 మంది కోరితే కేవలం 18 మందికి మాత్రమే తాను ఇవ్వగలిగానని ట్వీట్ చేశాడు.

మనం అందరం విఫలమయ్యామని.. మనతోపాటు దేశ వైద్యరంగం కూడా విఫలమైందంటూ సోనూ సూద్ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత పెద్ద దేశంలో కనీసం ఆస్పత్రుల్లో బెడ్స్, మందులు ఇప్పించలేకపోతున్నామని సోనూసూద్ తన అసహాయతను వ్యక్తం చేశాడు.

సోనూ సూద్ సైతం ప్రస్తుతం కరోనా బారినపడ్డారు. ‘ఆచార్య’ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న అతడు షూటింగ్ సమయంలో కరోనా పాజిటివ్ గా తేలాడు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తనకు ట్వీట్ల ద్వారా కోరిన వారికి సహాయం చేస్తున్నారు.

మొదటి సారి కరోనా అనుభవాన్ని చూసిన ప్రభుత్వాలు ఈసారి పకడ్బందీ గా వెళితే ఇంతటి ఉపద్రవాలు వచ్చేవి కావని అందరూ నిలదీస్తున్నారు. సోనూసూద్ మాత్రమే కాదు.. ఈ దుస్థితికి మోడీ, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రతిసామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

Tags:    

Similar News