తెలంగాణ‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్‌..ఏం జ‌ర‌గ‌బోతోంది..!

Update: 2019-09-01 07:01 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ అందుకు త‌గ్గ‌ట్టుగానే వ్యూహాత్మ‌కంగా ముందుకు వ‌స్తోంది. తెలంగాణ‌లో ప‌ట్టుకోసం స‌రికొత్త అస్త్రాల‌తో దూసుకొస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్న‌టికి మొన్న ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్‌ ను నియ‌మించిన కేంద్రం.. తాజాగా.. తెలంగాణ‌కు కూడా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌ ను నియ‌మించింది. తెలంగాణ నూతన గవర్నర్‌ గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌ రాజన్‌ నియమితులయ్యారు.

ఈ మేరకు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక‌ తెలంగాణ గవర్నర్‌ గా ప్రస్తుతమున్న ఈ ఎస్ ఎల్‌ నరసింహాన్‌ ను బదిలీ చేసింది. సౌందర్‌ రాజన్‌ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ద‌క్షిణాదికి చెందిన నేత‌నే.. తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించ‌డం బీజేపీ వ్యూహాత్మ‌క అడుగేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ద‌క్షిణాది రాజ‌కీయాల‌పై మంచి ప‌ట్టున్న సౌంద‌ర్‌ రాజ‌న్‌ ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించ‌డం వెనుక భారీ స్కెచ్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల అమ‌లులో గ‌వ‌ర్న‌ర్‌ ది అత్యంత కీల‌క పాత్ర‌. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను ప‌రిశీలిస్తూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూకుడుకు అడ్డ‌క‌ట్ట‌వేస్తూ.. కేంద్రానికి స‌రియైన స‌మాచారం ఇస్తూ.. అంతిమంగా తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కావ‌డ‌మే ల‌క్ష్యంగా క‌మ‌లం పెద్ద‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. సాధార‌ణంగా.. గ‌వ‌ర్న‌ర్లు కేంద్ర ప్ర‌భుత్వానికి సానుకూలంగా ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయం మ‌రింత రంజుగా మార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. నిజానికి.. ఈఎస్ ఎల్‌ న‌ర‌సింహ‌న్ ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ గా యూపీఏ హ‌యాంలోనే నియామ‌కం అయ్యారు. అయినా.. దాదాపుగా తొమ్మిదేళ్ల‌పాటు కొన‌సాగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప‌నిచేశారు. ఇక ఎప్పుడు కూడా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌ట్టిన సంద‌ర్భాలు లేవ‌నే చెప్పాలి.

ఒక్క మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లో త‌ప్ప‌. తాజాగా.. తెలంగాణ‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం కావ‌డంతో.. అందులోనూ ద‌క్షిణాది నేత కావ‌డంతో.. ఇక టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి చుక్క‌లు క‌న‌బ‌డ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ త‌న‌కున్న కేంద్రం అధికారాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలో ముందుముందు అనూహ్య ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.


Tags:    

Similar News