గంగూలీ మళ్లీ ఎందుకొస్తున్నట్టు? పంచాయితీ ముగియలేదా?

Update: 2023-01-03 15:47 GMT
దేశంలోని అన్ని వ్యవస్థలను ఆధీనంలోకి తీసుకున్నట్టే అమిత్ షా బ్యాచ్ ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐని కూడా హస్తగతం చేసుకుంది. అమిత్ షా కుమారుడు జైషా బీసీసీఐకి తిరుగులేని రారాజుగా మారారు. మొన్నటివరకూ కొరకరాని కొయ్యగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీని పొగబెట్టి సాగనంపిన జైషా ఇప్పుడు రోజర్ బిన్నీని నామమాత్రపు అధ్యక్షుడిగా చేర్చి తనే ప్రధాన కార్యదర్శిగా చక్రం తిప్పుతున్నాడు. క్రికెట్ కు సంబంధం లేని.. అసలు క్రికెట్ ఆడని జై షా అందులో చక్రం తిప్పుతుండడమే క్రీడాభిమానులను జీర్ణించుకోలేకుండా ఉంది.

బీసీసీఐ నుంచి సాగనంపాక గంగూలీ ఇక క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు నిరాకరించారు. జైషా ఇచ్చిన షాక్ తో ఇక క్రికెట్ వ్యవహారాలకు దూరంగా జరిగాడని అంతా అనుకున్నారు. కానీ మెల్లిగా జీర్ణించుకొని మళ్లీ క్రికెట్ లోకి ప్రవేశించడానికి రెడీ అయ్యారు. జైషా వర్గానికి షాకిచ్చారు.

సౌరవ్ గంగూలీ వచ్చే ఐపీఎల్ సీజన్ లో మళ్లీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా సేవలందించేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ఈ విషయం తెలుపాల్సి ఉంది. అయితే డీల్స్ పూర్తయ్యాయని మీడియా తెలిపింది.

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు సౌరవ్ గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు హెడ్ కోచ్, మెంటర్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా సేవలందించనున్నాడు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంతోపాటు ఆ ఫ్రాంచైజీకి చెందిన ఐఎల్టీ20 లోని దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికాలోని టీ20లీగ్ లోని పెట్రోరియా క్యాపిటల్స్ టీంలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు.

క్రికెట్ నుంచి పూర్తిగా దూరంగా జరుగుతాడని బీసీసీఐ పెద్ద జైషా భావించాడు. కానీ ఇప్పుడు మళ్లీ క్రికెట్ లోకి గంగూలీ ఎంట్రీ ఇస్తుండడంతో ఇప్పుడు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024లో బీజేపీ అధికారం కోల్పోతే మళ్లీ గంగూలీ యాక్టివ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News