మోడీతో సెలబ్రిటీల భేటీలో సౌత్ వాళ్లను అలా ట్రీట్ చేశారా?

Update: 2019-11-03 06:21 GMT
దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో సత్ సంబంధాల కోసం ప్రధాని మోడీ అనుసరించే విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి. దేశ చరిత్రలో మరే ప్రధాని వ్యవహరించని రీతిలో ఆయన నిర్ణయాలు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఆనందంతో వారంతా ఫిదా అయ్యేలా చేస్తుంటారు. ఈ మధ్యన జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని బాలీవుడ్ స్టార్స్ తో ప్రధాని మోడీ ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం.. బాపూ ఆశయాల గురించి ప్రస్తావించటం తెలిసిందే.

అయితే.. ఈ కార్యక్రమానికి దక్షిణాది సినీ రంగాన్ని మోడీ సర్కారు విస్మరించిందంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉపాసన రాంచరణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ రంగానికి చెందిన ప్రముఖులకు భిన్నంగా ఉపాసన ధైర్యంగా ట్వీట్ చేయటంతో ఇదో పెద్ద చర్చకు తెర తీసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆసక్తికర విషయాన్ని పోస్ట్ చేశారు. మోడీ నిర్వహించిన కార్యక్రమానికి తాను కూడా హాజరైనట్లు చెప్పారు.  మీడియా మొఘల్ రామోజీ రావు పుణ్యమా అని తాను వెళ్లగలిగినట్లు చెప్పిన ఆయన.. అందుకు మీడియా పెద్దాయనకు థ్యాంక్స్ చెప్పారు.

నిజానికి ఈ భేటీలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్న ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తే.. దక్షిణాదికి చెందిన కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లుగా అర్థమవుతుంది. బాలీవుడ్ తో పోలిస్తే.. దక్షిణాది సినీ రంగానికి చెందిన వారిని విస్మరించినట్లుగా తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పీఎంవో భద్రతా సిబ్బంది అందరి సెలబ్రిటీల నుంచి ఫోన్లను ముందుస్తుగా తీసుకున్నారని.. సదరు ఫోన్లకు టోకెన్లు ఇచ్చి లోపలకు పంపినట్లు పేర్కొన్నారు. అందరి నుంచి ఫోన్లు తీసుకుంటున్నట్లుగా అక్కడి భద్రతా సిబ్బంది చెప్పారని.. కానీ.. కొందరు బాలీవుడ్ స్టార్లు మాత్రం తమ దగ్గరున్న ఫోన్లతో ప్రధానితో సెల్ఫీలు తీసుకోవటాన్ని ప్రస్తావించారు.

ప్రధాని భేటీకి ఆహ్వానించటంతో దక్షిణాది వారిని మోడీ తక్కువ చేశారన్న మాట వినిపిస్తున్న వేళ.. సెల్ ఫోన్లు అనుమతించే విషయంలోనూ పీఎంవో భిన్నంగా వ్యవహరించారా? అన్న సందేహానికి తెర తీసేలా బాలు ఫేస్ బుక్ పోస్టు ఉంది. సౌత్ నుంచి వెళ్లిన సెలబ్రిటీల నుంచి ఫోన్లకు టోకెన్లు చేతిలో పెట్టిన సిబ్బంది.. బాలీవుడ్ స్టార్స్ కు చెందిన ఫోన్లను అనుమతించటం ద్వారా సెల్ఫీలు తీసుకోగలిగారని.. ఇది తమను తికమకకు గురి చేసిందని పేర్కొన్నారు. ఎస్పీ బాలు ఫేస్ బుక్ పోస్టు పుణ్యమా అని కొత్త చర్చకు తెర తీసినట్లే. అన్నారంటే అన్నారని కానీ మోడీ మాష్టారు.. దక్షిణాది వారి విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నట్లు?
 
Tags:    

Similar News