300 మందితో సైకిల్ తొక్కేసిన ఎస్పీ

Update: 2015-09-13 08:39 GMT

Full View
జిల్లాల్లో ఎస్పీ ఆఫీసుకు ఎప్పుడైనా వెళ్లారా? జిల్లా పోలీస్ బాస్ అయిన ఆయన్ను కలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయన చుట్టూ ఉండే.. మంది మార్బలంతో చాలా హడావుడిగా ఉంటారు. అలాంటి ఎస్పీ సాదాసీదాగా ఉంటూ.. సామాన్యులతో కలిసి పోవటమే కాదు.. సామాజిక అంశాలకు సంబంధించిన అంశాల్లో ముందుండటం చిన్న విషయం కాదు.

అలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం తెలుగు క్యాడర్ కు చెందిన అకే రవికృష్ణ సొంతం. తాను పని చేసే ఏ జిల్లాలో అయినా.. తనదైన శైలిలో పాలన సాగిస్తుంటారు. అవినీతి మరక అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే.. సమస్యల పరిష్కారంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాహసోపేతంగా వ్యవహరించటం.. సెక్యూరిటీ బంధనాలకు దూరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది.

ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్న ఆయన.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోకి వెళ్లిపోతుంటారు. కర్నూలు జిల్లాలో అత్యంత సమస్యాత్మక  ఫ్యాక్షనిస్టు గ్రామంగా పేరొందిన కపట్రాళ్లను సందర్శించారు. నిజానికి ఈ గ్రామానికి ఎస్పీ స్థాయి అధికారి వెళ్లేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు. కానీ.. రవికృష్ణ రూటు కాస్త సపరేటు.

అందుకే ఆయన.. కపట్రాళ్ల గ్రామానికి 300 మంది స్థానిక యువకులతో కలిసి సైకిల్ యాత్ర చేపట్టారు. స్వచ్ఛభారత్ లో భాగంగా కోడుమూరు నుంచి కపట్రాళ్ల గ్రామం వరకూ ఎస్పీ రవికృష్ణ సైకిల్ తొక్కేశారు. గ్రామంలోని పాఠశాల భవనాన్ని పరిశీలించటం.. గ్రామ వీధుల్ని పరిశీలించటంతో పాటు..రోడ్డు మీద చిన్న చిన్న గుంతల్ని పూడ్చి శ్రమదానం చేయటం చూస్తే.. ఇలాంటి ఎస్పీలు మరికొందరు ఉంటే ఎంత బాగుండనిపించక మానదు.
Tags:    

Similar News