అంత‌రిక్ష యాత్ర టిక్కెట్ ధ‌ర‌.. 205 కోట్లు!

Update: 2021-06-13 14:30 GMT
ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు వెళ్లివ‌చ్చారు. అయితే.. తొలిసారి యాత్రికులు వెళ్లి రాబోతున్నారు. స్పేస్ ప్ర‌యోగాల కోసం అమెజాన్ వ్య‌వ‌స్థ‌పాకుడు జెఫ్ బెజోస్ సొంతంగా ‘బ్లూ ఆరిజిన్‌’ అనే సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ.. ‘న్యూ షెఫర్డ్’ అనే వ్యోమ నౌకను అభివృద్ధి చేసింది. ఈ నెల 20న ఈ స్పేస్ షిప్ నింగిలోకి ఎగ‌ర‌బోతోంది.

ఇందులో మొత్తం ఆరు సీట్లు ఉన్నాయి. మూడు సీట్ల‌లో వ్యోమ‌గాములు ఉంటారు. మ‌రో రెండు సీట్ల‌లో సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్, అత‌ని సోద‌రుడు మార్క్ బెజోస్ కూర్చుంటారు. మిగిలిన ఒక్క సీటులో ఎవ్వ‌రైనా కూర్చోవొచ్చ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఫ్రీగా కాదు. ఈ సీటును వేలం వేశారు. ఎవ‌రు ఎక్కువ డ‌బ్బులు చెల్లిస్తే.. వాళ్ల‌కే కేటాయిస్తార‌న్న‌మాట‌. ఈ వేలాన్ని నిన్న‌(12) నిర్వ‌హించారు.

అయితే.. ఔత్సాహికులు మాత్రం భారీగానే పోటీ ప‌డ్డారు. మొత్తం 143 దేశాల నుంచి 6 వేల మందికిపైగా పోటీ ప‌డ్డార‌ని బ్లూ ఆరిజిన్ సంస్థ ప్ర‌క‌టించింది. ఇందులో అత్య‌ధిక వేలం పాడిన వ్య‌క్తికి ఆ సీటును కేటాయించారు. ఆ మొత్తం ఎంతంటే.. 20 మిలియ‌న్ డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో 205 కోట్లు. ఈ వేలం కూడా కేవ‌లం నాలుగు నిమిషాల్లోనే ముగియ‌డం విశేషం.

ఇక‌, యాత్ర మొద‌లు కావ‌డ‌మే త‌రువాయి. అయితే.. ఈ టూర్‌ ఎన్ని రోజులు ఉంటుంద‌ని లెక్కిస్తున్నారేమో.. కేవ‌లం ప‌దంటే ప‌దే నిమిషాల్లో ముగుస్తుంది! అవును.. ఈ స్పేస్ షిప్ ఆకాశంలోకి 100 కిలోమీట‌ర్ల పైకి వెళ్లి.. మ‌ళ్లీ పారాషూట్ స‌హాయంతో నేల‌కు దిగుతుంది. అయితే.. వేలంలో పాల్గొన్న‌ ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. టెక్సాస్ నుంచి ఈ నెల 20న ఈ అద్భుతం జ‌ర‌గ‌నుంది.




Tags:    

Similar News