అంతరిక్షం యానం పై బిజినెస్ మొదలెట్టిన ప్రపంచ కుబేరులు

Update: 2021-07-13 09:24 GMT
అంతరిక్షం...అనంతం. ఎంత తెలుసుకున్నా కూడా ఇంకో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అలాగే అందరికి అంతరిక్షం గురించి ఇంకా ఎదో కొత్తగా తెలుసుకోవాలని కూడా ఉంటుంది. ఇక అంతరిక్షంలో ప్రయాణం చేయడం అనేది అందరికి ఓ కల. విమానాల్లో ప్రయాణాలు మొదలైన తర్వాత అంతరిక్షం లోకి వెళ్లాలనే కల రోజురోజుకి పెరిగిపోతుంది. ర‌ష్యా వ్యోమ‌గామి యూరిగ‌గారిన్ ఎప్పుడేతే అంత‌రిక్షంలోకి అడుగుపెట్టాడో అప్ప‌టి నుంచి మ‌రింత ఆస‌క్తి నెల‌కొన్న‌ది. అంతరిక్షం గురించి ప‌రిశోధ‌న‌లు వేగంగా సాగుతున్నాయి.  స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థ‌లు ఎంట‌ర‌య్యాక ఒక్క‌సారిగా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. వ‌ర్జిన్ గెల‌క్టిక్‌, బ్లూఆరిజిన్‌, స్పేస్ ఎక్స్ వంటి సంస్థ‌లు అంత‌రిక్ష ప‌రిశోధ‌న రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధ‌న మొత్తం అంత‌రిక్ష యాత్ర చుట్టూనే జ‌రుగుతున్నాయి.

అంత‌రిక్ష విమానంలో కూడా ప్ర‌యాణం చేయాల‌ని ఎంతో మందికి ఉంటుంది.  అలాంటి వారి కోసం వ‌ర్జిన్ గెల‌క్టిక్‌ లు, బ్లూఆరిజిన్ లు స్పేస్ షిప్‌ ల‌ను త‌యారు చేస్తున్నాయి. జులై 11 వ తేదీన వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ కు చెందిన స్పేస్ షిప్ విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి వెళ్లి వ‌చ్చింది.  90 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది.యాత్ర విజ‌య‌వంతం కావ‌డంతో రాబోయో రోజుల్లో స్పేస్ యాత్ర‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా ప్రారంభించేందుకు వ‌ర్జిన్ గెలాక్టిక్ స‌న్నాహాలు చేస్తున్న‌ది. ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. నింగికి ఎగిసిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగివచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.

కాగా, ఈ రోదసి యాత్రలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాల్గొనడం విశేషం. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలో ప్రవేశించిన మూడో భారత సంతతి మహిళగా శిరీష ఘనత సాధించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష‌ కొన్నాళ్లుగా వ‌ర్జిన్ గెలాక్టిక్‌ లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, రీసెర్చ్ ఆప‌రేష‌న్‌ ల వైస్ ప్రెసిడెంట్‌ గా ప‌ని చేస్తున్నారు. శిరీష 2015లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల మేనేజ‌ర్‌ గా  వ‌ర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఈ మ‌ధ్యే 747 ప్లేన్ ఉప‌యోగించి అంత‌రిక్షంలోకి శాటిలైట్‌ ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్ట‌న్ ఆప‌రేష‌న్స్‌ను కూడా చూసుకుంటోంది. ప‌ర్‌డ్యూ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్, జార్జ్‌టౌన్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

డెన్నిస్‌ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్‌ బ్రాస్నన్‌ వర్జిన్‌ గెలాక్టిక్‌ కంపెనీ, అమెజాన్‌ యజమాని జెఫ్‌ బెజోస్‌ బ్లూఆరిజిన్‌ కంపెనీని, టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యే స్పేస్‌ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు.  

స్పేస్‌ ఎక్స్‌

ఈ సంస్థ తమ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ‘ది క్రూ డ్రాగన్‌’ స్పేస్‌ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్‌స్పిరేషన్‌4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్‌ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్‌ షిప్‌’ స్పేస్‌ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్‌ చేసుకున్నారు.

ఆక్సిమ్‌ స్పేస్‌
స్పేస్‌ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్‌ స్పేస్‌ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్‌ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్‌ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్‌ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు.

బ్లూ ఆరిజిన్‌

ఈ సంస్థ తమ న్యూషెపర్డ్‌ పునర్వినియోగ రాకెట్‌ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్‌ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్‌ ప్రకటించింది.

రష్యా స్పేస్‌ ఏజెన్సీ తమ సోయూజ్‌ రాకెట్‌ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్‌ కంపెనీ స్పేస్‌ టూరిజం కోసం స్టార్‌లైనర్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్‌ ఆఫ్‌ గేట్‌వే ఫౌండేషన్‌ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్‌ ‘వోయేజర్‌ స్టేషన్‌’ను ప్లాన్‌ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి.  అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్‌ఎస్‌లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్‌ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్‌ఎస్‌లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది.  అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్‌ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది.
Tags:    

Similar News