అచ్చెన్నాయుడి మైక్ క‌ట్ అయ్యింది

Update: 2015-09-03 12:31 GMT
అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార‌ప‌క్షానికి త‌మ వాద‌న‌ను వినిపించుకోవ‌టానికి ఎక్కువ అవ‌కాశం ఉండ‌టంతో పాటు.. ముఖ్య‌మంత్రి.. మంత్రులు ఏదైనా మాట్లాడాల‌ని భావిస్తే వారికి పెద్ద‌పీట వేయ‌టం మామూలే. అయితే.. ఇందుకు భిన్న‌మైన ఘ‌ట‌న ఏపీ అసెంబ్లీలో గురువారం చోటు చేసుకుంది.

మిగిలిన వారితో పోలిస్తే.. స్పీక‌ర్ గా కోడెల ప‌నితీరుపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్న వేళ‌.. తాజాగా ఆయ‌న అనుస‌రించిన వైఖ‌రిపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీ అసెంబ్లీలో క‌ర‌వుపై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప‌ట్టిసీమ అంశాన్ని చ‌ర్చ‌కు తీసుకొచ్చారు. దీంతో.. అధికార‌ప‌క్ష స‌భ్యులు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో స్పీక‌ర్ క‌ల్పించుకొని.. చ‌ర్చ‌ను క‌ర‌వుపైనే పెట్టాల‌ని.. అంత‌కు మించి.. మ‌రే విషయాన్ని చ‌ర్చ‌కు తేవొద్దంటూ సూచించారు.

అదే స‌మ‌యంలో మాట్లాడేందుకు మంత్రి అచ్చెన్నాయుడు మైకు కోరారు. స్పీక‌ర్ త‌న‌కిచ్చిన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకొని అచ్చెన్నాయుడు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తూ.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ఓదార్పు యాత్ర అంశాల్ని ప్ర‌స్తావించ‌టం మొద‌లు పెట్టారు. క‌ర‌వుపై చ‌ర్చ కాస్తా.. ప‌క్క‌దారి ప‌ట్ట‌టంతో.. కోడెల ఆల‌స్యం చేయ‌కుండా మంత్రి అచ్చెన్నాయుడి మైకు క‌ట్ చేశారు.

విప‌క్షాల‌పై విరుచుకుప‌డే అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ చెల‌రేగిపోయే అచ్చెన్నాయుడి మాట బ‌య‌ట‌కు రాకుండా.. స్పీక‌ర్ మైకు క‌ట్ చేయ‌టం అధికార‌ప‌క్ష స‌భ్యులు సైతం విస్మ‌యం చెందే ప‌రిస్థితి. మంత్రి మైకును క‌ట్ చేసిన స్పీక‌ర్ కోడెల తీరు రాజ‌కీయ వ‌ర్గాల‌కు కూసింత ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. మొత్తానికి త‌న మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స్పంద‌న‌గా మైక్ క‌ట్ చేశారో లేక‌.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు హ‌ద్దులు దాటుతున్నాయ‌ని కోడెల భావించారో కానీ.. అధికార‌ప‌క్షానికి చెందిన ఒక మంత్రి మైక్ క‌ట్ చేయ‌టం మాత్రం కాస్తంత అరుదైన అంశంగానే చెప్పాలి.
Tags:    

Similar News