స్పీక‌ర్ ఇలాకాలో వైసీపీ 'త‌టికిట‌తోం.. త‌టికిట‌తోం!!'

Update: 2022-12-24 02:30 GMT
అది స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఇలాకా. అంటే.. శ్రీకాకుళం జిల్లాలో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఆముదాల వ‌ల‌స‌. ఇక్క‌డ రాజు ఆయ‌న‌.. ఆయ‌న స‌తీమ‌ణి.. ఆయ‌న వార‌సుడు.

ఈ ముగ్గురు చెప్పిందే వేదం. వారు చేసిందే రాజకీయం అన్న‌ట్టుగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే స్పీక‌ర్ స‌తీమ‌ణి పంచాయితీ స‌ర్పంచ్‌గా ఉన్నారు. ఇక‌,త‌మ్మినేని త‌న‌యుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ప్రిపేర్ అవుతు న్నారు.

స‌రే.. విష‌యం అయితే.. వీరి గురించి కాదు! వీరి క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్నామ‌ని చెప్పుకొనే కొంద‌రు నాయ‌కులు ఉన్నారు. వారికి ఈ కుటుంబం చెప్పిందే మాట అంటుంటారు. అయితే.. ఇప్పుడు వారి గురించి కూడా  రాజ‌కీయం కాదు!!  ఎటొచ్చీ.. ఆముదాల వ‌ల‌స‌లోని మేజ‌ర్ పంచాయ‌తీకి చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న ఓ మ‌హిళ గురించేక‌థంతా! ఆమె వైసీపీకి అత్యంత ప్రియ‌మైన నాయ‌కురాలు.

సీఎం జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తే.. ఆమె కూడా 100 కిలో మీట‌ర్లు న‌డిచి.. పార్టీ కోసం ప‌నిచేసింది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ క‌లిసి వ‌చ్చి.. ఆమె గెలిచింది.

అయితే.. ఇప్పుడు ఆమె త‌మ‌కు అనుకూలంగా చ‌క్రం తిప్ప‌డం లేద‌న్న‌ది.. త‌మ్మినేని అనుచ‌రులుగా చెప్పుకొంటున్నవారి అభ్యంత‌రం. దీంతో ఆమెను హైజాక్ చేస్తున్నార‌ని.. స్వ‌యంగా ఆమే.. పంచాయితీ పెట్టింది.

మీడియాముందు ఘొల్లు మంది. వైసీపీ అధిష్టానం ప‌ట్టించుకుని త‌న‌కు న్యాయం చేయాల‌ని గ‌గ్గోలు పెట్టింది. త‌న‌ను కులం పేరు పెట్టి దూషిస్తున్నార‌ని.. వివాహిత‌గా ఉన్న త‌న‌పై అభాండాలు వేస్తూ.. విప‌రీత ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆమె వాపోతున్నారు. దీనిపై స్పంద‌నలో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు చెప్పారు. కానీ, ఇప్ప‌టికీ ఆ అనుచ‌రులు మాత్రం మార‌లేద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి త‌న సొంత నియోజ‌వ‌క‌ర్గంలో ఇంత జ‌రుగుతున్నా.. స్పీక‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేదేంటా? అనేదే.. ఇప్పుడు చ‌ర్చ‌!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News