థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ 'బాబు'కి స్పీకర్ వార్నింగ్ ... అట్టుడికిన అసెంబ్లీ !

Update: 2020-12-01 12:46 GMT
శీతాకాలంలో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టిడ్కోపై చర్చ సందర్భంగా వీరి గొడవ తారా స్థాయికి చేరింది. స్పీకర్ తమ్మినేని వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేలెత్తి చూపించడంపై సభలో తీవ్ర దుమారం రేగింది. చేతిలో పేపర్లు స్పీకర్ వైపు విసిరేశారు. చంద్రబాబు తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీరియస్‌ అయ్యారు. సభాధ్యక్షుడినే బెదిరిస్తారా, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బెదిరింపులకు భయపడేది లేదంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.

పోడియంలోకి వచ్చి బెదిరిస్తావా, ఏమనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు అంటూ.. తన చేతిలో ఉన్న పేపర్లను విసిరేసారు స్పీకర్. చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా సీటులో నుంచి లేచి నిలబడి, స్పీకర్‌పై విమర్శలు గుప్పించారు. మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన పై కూడా స్పీకర్ తమ్మినేని ఫైర్ అయ్యారు. మీ శాపనార్థాలకు భయపడేది లేదంటూ స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మీద తీవ్రంగా ఫైరయ్యారు. నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబును హెచ్చరించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇలానేనా వ్యవహరించేది అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని స్పీకర్ స్పష్టం చేశారు.

స్పీకర్‌ పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ‌కు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన వర్గాలను చంద్రబాబు అవమానిస్తున్నారని మంత్రి శంకర్‌ నారాయణ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్, చంద్రబాబు వాగ్వాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేపర్లు విసిరేసి, స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తారా, అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఒక ప్రొసీజర్ ప్రకారం సభ ముందుకు వెళ్తుందని, మధ్యలో ఎప్పుడు అడిగితే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా, అని విమర్శించారు. సభలో పద్దతిగా వ్యవహరించాలని చురకలంటించారు.
Tags:    

Similar News