ఇటలీలో చిక్కుకున్న ఆ విద్యార్థుల్ని రక్షించారు

Update: 2020-03-22 16:30 GMT
కరోనా వైరస్ పుట్టింది.. ముందుగా నష్టం చేకూర్చింది చైనాలోనే. కానీ తర్వాతి దశలో ఆ వైరస్ ధాటికి అల్లాడిపోతున్నది మాత్రం ఇటలీనే. నిన్న, శనివారం ఒక్క రోజులోనే అక్కడ 800 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇప్పటిదాకా నాలుగు వేల మందికి పైగానే ప్రాణాలు వదిలారు. దీంతో ఆ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు అక్కడ ఉండలేక.. భారత్‌కు రాలేక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

కరోనా భయంతో ఇండియాకు పయనమైన తెలుగు విద్యార్థులకు ఎయిర్ పోర్టు లో కొన్ని రోజులుగా అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. వారిని విమానాల్లోకి అనుమతించడం లేదు. తమకు కరోనా వైరస్‌ లేనట్లు సర్టిఫికెట్ తేవాలంటూ ఎయిర్ పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు గత కొన్నిరోజులుగా అక్కడ చిక్కుకొని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా ఎయిర్ పోర్టుల్లోనే పడిగాపులు కాస్తూ.. రోజు వారీ తిండి ఖర్చులకు చేతుల్లో ఉన్న డబ్బులు సరిపోక విద్యార్థులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

ఐతే వీరి గురించి మీడియాలో వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వారిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. వీరి కోసం భారత్ ప్రత్యేక విమానం పంపించింది. 263 మంది విద్యార్థుల్ని ఇటలీ రోమ్ నగరం నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో తరలించారు. ఉదయం 9.15 గంటలకు విమానం దేశ రాజధానికి చేరుకుంది. వీరికి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్‌ వార్డులకు తరలిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకం బస్సుల్ని తీసుకొచ్చారు. ఆ బస్సుల్లో మాత్రమే వారిని తీసుకెళ్లి క్వారంటైన్ చేయనున్నారు.
Tags:    

Similar News