ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం..జగన్ కార్యాచరణ మొదలైనట్టే

Update: 2019-06-03 14:18 GMT
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నవ్యాంధ్రప్రదేశ్... త్వరితగతిన కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ అందరి నోటా వినిపిస్తోంది. ఆది నుంచి హోదా డిమాండ్ ను సజీవంగా ఉంచేందుకు తనదైన శైలి కార్యాచరణతో ముందుకు సాగిన వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ దిశగా ఇప్పుడు మరింత దూకుడు పెంచేస్తున్నారు. అంతేకాకుండా ఈ దిశగా మరింత పకడ్బందీగా ముందుకు సాగాలని కూడా ఆయన తీర్మానించుకున్నారు. కేంద్రం వద్ద హోదా డిమాండ్ ను మరింతగా సమర్థవంతంగా వినిపించేందుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎంగా ప్రమాణం చేయకుండానే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా జగన్ హోదా డిమాండ్ ను ప్రస్తావించారు. అయితే మోదీ ఏమన్నారో తెలియదు గానీ.. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఇప్పుడు లేవని, అయినా కూడా హోదా సాధన కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని జగన్ ప్రకటించారు. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరాలని, అందుకోసం కేంద్రంలో ఏ కూటమికి కూడా క్లియర్ మెజారిటీ రాకూడదని తాను దేవుడిని ప్రార్థించానని, అయితే అందుకు విరుద్ధంగా ఎన్డీఏకు ఇతర పార్టల మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ దక్కిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం చేస్తాం... ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ రావడం మన ఖర్మ అంటూ కూడా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా గతం అనుకుంటే... ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్... ఇప్పుడు హోదా సాధన దిశగా పకడ్బందీ కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికలు రూపొదించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సదరు నివేదికలను 15వ ఆర్ధిక సంఘం ముందు పెట్టి... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్న వాదనను బలంగా వినిపిద్దామని ఆయన అధికారులకు సూచించారు. మొత్తంగా పక్కా నివేదికలు, వాస్తవిక పరిస్థితులను ఉదహరిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరన్న విషయాన్ని ఇటు కేంద్రంతో పాటు అటు 15వ ఆర్థిక సంఘం ముందు పెట్టి పోరాటం చేసేందుకు జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారు.
Tags:    

Similar News