చినబాబుకు యాత్రా స్పెష‌ల్ క్లాసులు!

Update: 2022-11-28 04:31 GMT
టీడీపీ యువ‌నాయ‌కుడు, నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ ఇప్పుడు శిక్ష‌ణ త‌ర‌గ‌తుల్లో బిజీగా గ‌డుపుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి చావో రేవో ఎన్నిక‌లుగా మారాయి. టీడీపీ ఎట్టైనా స‌రే మ‌ళ్లీ అధికారంలోకి తేవాల‌ని నారా లోకేష్  వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికోసం ఆయ‌న వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఈ పాద‌యాత్ర స‌న్నాహాలు తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతున్నాయి. ఈ పాద‌యాత్ర‌కు సంబంధించి నారా లోకేష్ ఇప్పుడు హైద‌రాబాద్‌లో కొంత‌మంది నిపుణుల వ‌ద్ద శిక్ష‌ణా త‌ర‌గ‌తులు చెప్పించుకుంటున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత వై.ఎస్‌.జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి త‌న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తాను ముఖ్య‌మంత్రి పీఠం అధిష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే పంథాలో పాద‌యాత్ర చేసి టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసురావాల‌ని చూస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను మించిపోయేలా, నారా లోకేష్ పాద‌యాత్ర అద్భుతం అనిపించేలా ఈ పాద‌యాత్ర చేస్తేనే రాజ‌కీయంగా ప్ర‌యోజ‌న‌ముంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో 341 రోజుల పాటు 3,648 కిలో మీట‌ర్ల పాద‌యాత్ర చేసి జ‌నాల్ని ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు ఆయ‌న పాద‌యాత్ర‌కు మించి నారా లోకేష్ ఏకంగా 4 వేల కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేసి జ‌గ‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.  అయితే ఇప్పుడు ఈ  పాద‌యాత్ర‌లో జ‌నాల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మెలా?  ప్ర‌జ‌ల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసేలా ప్ర‌సంగించ‌డ‌మెలా? అనేటివి లోకేష్‌కు పెద్ద ఇబ్బందులుగా మారాయి.  త‌న పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఒక సామాన్యుడిలా ప్ర‌జ‌ల‌కు చెంత‌కు వెళ్లి వాళ్ల‌ను చాలా ఆప్యాయంగా ప‌లుక‌రించి ఎంతో ఆత్మీయంగా వారితో మాట్లాడి వారి క‌ష్ట‌సుఖాలు తెలుసుకునేవారు. దాంతో జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ను ఒక నాయ‌కుడిలాగానే కాకుండా త‌మ ఇంట్లో మ‌నిషిలా కూడా ఆద‌రించారు.

రాయ‌ల‌సీమ‌లో పుట్టి పెరిగిన జ‌గ‌న్‌కు రాయ‌ల‌సీమ మాండ‌లికం బాగా వ‌చ్చు. అది ఆయ‌న‌కు పాద‌యాత్ర‌లో ఎంతో లాభం చేకూర్చేలా చేసింది. ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆయ‌న వారి వ‌య‌సుల‌ను బ‌ట్టి ఏం అవ్వా, తాతా, అక్కా, అన్నా, త‌మ్ముడు, అమ్మా  ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా ప‌లుక‌రించి వారితో మ‌మేక‌మ‌య్యారు. ఇది ఆయ‌న పాద‌యాత్ర‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

నారా లోకేష్ ప‌రిస్థితి దీనికి భిన్న‌మైన‌ది. నారా చంద్ర‌బాబు నాయుడు రాయ‌ల‌సీమ వాసే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మాట్లాడే భాష మాత్రం రాయల‌సీమ మాండ‌లికాన్ని పోలి ఉండ‌దు. లోకేష్ కూడా దీనికి భిన్న‌మేమీ కాదు. దాంతో పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌తో మరింత మమేక‌మై వారికి బాగా ద‌గ్గ‌ర‌వ‌డానికి ఎలా వ్య‌వ‌హ‌రించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి భాష ఉప‌యోగించాలి త‌దిత‌ర అంశాల‌పై నారా లోకేష్ సీరియెస్‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.  దీనికోసం ఆయ‌న నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన పాద‌యాత్ర‌, వై.ఎస్‌.ఆర్‌, వైఎస్ జ‌గ‌న్‌లు చేసిన పాద‌యాత్ర‌ల వీడియోలు కూడా కొన్ని చూస్తూ వాటిలోని అంశాల‌ను చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తున్నార‌ట‌.

పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌తో ఎలా మెల‌గాలి, వారిని ఎలా ఆక‌ట్టుకోవాలి అనే అంశాల‌పై  లోకేష్ కొంత‌మంది నిపుణ‌ల‌తో పాఠాలు కూడా చెప్పించుకుంటున్నార‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో దీనికి సంబంధించి ఆయ‌న కొన్ని స్పెష‌ల్ క్లాసులకు హాజ‌ర‌వుతున్నారు. లోకేష్‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి కొంత‌మంది వ్య‌క్తిత్వ వికాస నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర‌లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి, ఎలా మాట్లాడాలి, యువ‌తీ యువ‌కులు, చిన్న‌పిల్ల‌లు, పెద్ద‌ల‌తో ఎలా మాట్లాడాలి, ఎలా వారిని ఆక‌ట్టుకోవాలి త‌దిత‌ర అనేక అంశాల‌పైన ఈ స్పెష‌ల్ క్లాసుల్లో లోకేష్‌కు బోధిస్తున్నార‌ట‌.

జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌ను ఆత్మీయంగా ద‌గ్గ‌ర‌కు తీసుకుని వారికి ఆత్మీయంగా ముద్దులు పెట్టేవారు. నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌లో దీనికి భిన్నంగా ప్ర‌జ‌ల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలి అనే దానిపైనా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ట‌. త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన శైలి రూపొందించుకుని పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌లు త‌న‌తో మ‌మేక‌మ‌వ‌డ‌మే కాకుండా వారు దాన్ని ఒక తియ్య‌టి జ్ఞాప‌కంలా క‌ల‌కాలం గుర్తుండేలా ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వ్వాల‌ని నారా లోకేష్ భావిస్తున్నార‌ట‌.

తాను పాద‌యాత్ర చేయ‌బోయే ప్రాంతాల్లో ఉన్న స్థానిక స‌మ‌స్య‌ల గురించి కూడా ఆయ‌న అక్క‌డి టీడీపీ శ్రేణుల నుంచీ స‌మాచారం తెప్పించుకుని ఆయా ప్రాంతాల్లో అక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంతో పాటు ఆ ప్రాంత ప్ర‌జ‌ల ప్ర‌త్యేక‌త‌లు తెలుసుకుని వారితో వారి సొంత మ‌నిషిలా వ్య‌వ‌హ‌రించి వారితో మ‌మేకమ‌య్యేలా లోకేష్ త‌న పాద‌యాత్ర‌కు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకుంటార‌నేది ఆయ‌న సొంత‌పార్టీ టీడీపీ శ్రేణుల‌తో స‌హా స‌ర్వ‌త్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News