ఏపీకి ప్రత్యేక హోదా... మోడీ మార్క్ స్ట్రాటజీ...?

Update: 2022-02-12 08:35 GMT
ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నది సుదీర్ఘకాలంగా వినవస్తున్న డిమాండ్. ఉమ్మడి ఏపీ విభజన జరిగి ఇప్పటికి ఎనిమిదేళ్ళు అవుతోంది. నాడే ప్రత్యేక హోదా అన్నదిఏపీకి  రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆ వెంటనే వచ్చిన మోడీ సర్కార్ మాత్రం హోదా మొదట ఇస్తామని తిరుపతి సభలో  చెప్పినా ఆ  తరువాత ముగిసిన అధ్యాయం అన్నారు.

ఇక జగన్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పుకున్నారు. నాడు జనాలు కూడా నమ్మి 2019 ఎన్నికల్లో జగన్ కి అత్యధిక సంఖ్యలో ఎంపీలను ఇచ్చారు. అయితే 22 మంది లోక్ సభ, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నా హోదా మాత్రం మూడేళ్ల కాలంలో జగన్ సాధించలేకపోయారు అని విపక్షాలు దుయ్యబెడుతున్నాయి.

ఈ నేపధ్యంలో జగన్  ప్రభుత్వం ఇరుకుపడుతోంది. జగన్ ప్రతీసారీ ఢిల్లీకి వెళ్లినపుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా సడెన్ గా ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. విభజన సమస్యలతో పాటు, పెండింగులో ఉన్న అనేక అంశాల మీద చర్చించేందుకు కేంద్రం త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఒక విధంగా ఏపీకి ఇది శుభ పరిణామంగానే అంతా చూస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ  ఆద్వర్యంలో ఈ నెల 17న జరిగే సమావేశానికి రావాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది.

కేంద్ర హోం శాఖ త్రి సభ్య కమిటీ చర్చించే విభజన  అంశాల్లో తొమ్మిది ఉన్నాయి. అందులో ప్రత్యేక హోదా కూడా ఉండడంతో ఏపీలో ఆశలు పెరుగుతున్నాయి. మరి ఒక వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు  సమయం దగ్గర పడుతోంది. అదే టైమ్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన మెజారిటీ రాకపోతే వైసీపీ లాంటి పార్టీల మద్దతు అవసరం అన్న భావన ఉండడంతో ఇపుడు ప్రత్యేక హోదా అన్న దాన్ని ఇస్తారా, ఆ విధంగా ఏపీలో వైసీపీకి రాజకీయంగా బలం చేకూర్చేలా చేసి 2024లో జగన్ని కీలక మిత్రుడిగా మార్చుకుంటారా అన్నదే ఒక చర్చగా ఉంది.

ఇక కొద్ది రోజుల ముందే రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ విభజనను నాటి యూపీయే సర్కార్ సరిగ్గా డీల్ చేయలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ మీద మోడీ హాట్ కామెంట్స్ చేసినా కూడా అన్ని వేళ్ళూ మోదీ వైపే చూపిస్తున్నారు. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో మోడీ సర్కార్ ఏం చేసింది అన్నదే జనాల నుంచి వస్తున్న ప్రశ్న.

ఈ నేపధ్యంలో కేంద్రం ఆలోచనల్లో మార్పు వచ్చిందా అనంది కూడా చర్చగా ఉంది. ఇపుడు కేంద్ర హోం శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన హోం శాఖ కమిటీ ఇపుడు చర్చలకు పిలవడం, అందులో ప్రత్యేక హోదా ఉండడం మాత్రం మిణుగుమిణుగుమంటోంది.

ప్రత్యేక  హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెబుతున్న వేళ ఇపుడు కేంద్ర హోం శాఖ వేసిన త్రి సభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా ఉండడం అంటే మాత్రం కచ్చితంగా ఈ విషయంలో కొంత పురోగతిగానే ఉంది అనాలి. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను కూడా చర్చిస్తారు.

కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శితో పాటు ఏపీ తెలంగాణా, సీఎస్ లు సభ్యులుగా ఉండే ఈ త్రీ సభ్య కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 17న విభజన హామీల మీద పూర్తి స్థాయిలో  చర్చిస్తారు. మొత్తానికి మోడీ మార్క్ స్ట్రాటజీతోనే ప్రత్యేక హోదాను ముందుకుస్ తెస్తున్నారా అన్న విశ్లేషణ అయితే ఏపీలో పెద్ద ఎత్తున  సాగుతోంది.
Tags:    

Similar News