ఏపీ కేబినెట్ విస్తరణ.. తమ్మినేనికి మంత్రి.. కొత్త స్పీకర్ ఖాయం?

Update: 2020-07-20 06:45 GMT
మోపిదేవి, పిల్లి సుభాష్ లు మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో మళ్లీ మంత్రి పదవులపై ఆశలు చెలరేగాయి. వీరి స్థానంలో కొత్తవారిని నియమించడం ఖాయమని తేలడంతో ఆశావహులు ఆశలు పెంచుకున్నారు. ఈ శ్రావణమాసంలోనే ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తారనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొత్త వారు వస్తారని.. తమ్మినేని సీతారంకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. తమ్మినేని మొదటి నుంచి స్పీకర్ పోస్టు కంటే మంత్రి పదవిపైనే ఆశలు పెంచుకున్నారు. జగన్ ను కలిసి విన్నవించారు. గతంలో చాలా సార్లు మంత్రిగా చేసిన తమ్మినేనికి సామాజిక సమీకరణాల్లో స్పీకర్ పదవి దక్కింది. కళింగ సామాజిక వర్గమైన తమ్మినేనికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి చెక్ పెట్టవచ్చని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే తమ్మినేని మంత్రి పదవి ఖాయమంటున్నారు.

ఇక తమ్మినేనికి మంత్రిపదవి దక్కితే ఆయన స్థానంలో ఎవరికీ అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి స్పీకర్ పదవి ఖాయమంటున్నారు. ఆయన తండ్రి కోన ప్రభాకర్ రావు ఉమ్మడి ఏపీకి గతంలో స్పీకర్ గా పనిచేశారు. ఇప్పుడు తమ్మినేని పోతే  రఘుపతికే స్పీకర్ పదవి అంటున్నారు. రఘుపతికి ఇస్తే స్పీకర్ పదవి వివాదం కాకుండా ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయన బ్రాహ్మణ సామాజికవర్గం.. సౌమ్యుడు.. సభ నియమాలు తెలియడంతో సులువు అవుతుందని భావిస్తున్నారు.

ఇలా రెండు సామాజికవర్గాలకు న్యాయం చేయవచ్చని జగన్ భావిస్తున్నట్టు వైసీపీలో టాక్ నడుస్తోంది. జగన్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News