ట్రంపే కాదు.. ఆయ‌న ఆఫీసు అదే త‌ప్పు

Update: 2018-01-31 05:10 GMT
ఇంగిలిపీసులో అచ్చు త‌ప్పులు రాయ‌టం మామూలే. మిగిలినోళ్లు రాస్తే వారికున్న ఇబ్బందిని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. అమెరికా అధ్య‌క్షుడి హోదాలో ఉన్న ట్రంప్ లాంటి పెద్ద‌మ‌నిషి అచ్చుత‌ప్పులతో ట్వీట్లు చేయ‌టం.. అదో పెద్ద ఇష్యూలా మార‌టం ఈమ‌ధ్య కాలంలో జ‌రిగిందే.

అమెరికా అధ్య‌క్షుడి ట్వీట్ల‌లో త‌ర‌చూ అచ్చుత‌ప్పులు దొర్ల‌టంపై మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ స‌ర‌దా కామెంట్లు చాలానే క‌నిపిస్తాయి. ట్రంప్ గారి అచ్చుత‌ప్పుల అల‌వాటును ఆయ‌న ఆఫీసు కూడా అందుకున్న‌ట్లుగా ఉంది తాజా ఉదంతం చూస్తే.

అమెరికా అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా స్టేట్ ఆఫ్ యూనియ‌న్ లో ప్రసంగిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అతిథుల‌ను ఆహ్వానించేందుకు వీలుగా అమెరికా ప్ర‌భుత్వం ఇన్విటేష‌న్ కార్డుల్ని ప్రింట్ చేయించింది. అయితే.. ఈ కార్డుల్లో అచ్చు త‌ప్పు దొర్లటంపై ప‌లువురు వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ కార్డుల్లో unionకు బదులుగా uniom అంటూ పొరబాటుగా ప్రింట్ చేశారు.

జ‌రిగిన త‌ప్పును స‌రి చేసుకుంటూ ఆ కార్డుల వినియోగాన్ని వ‌దిలేసి.. కొత్త కార్డుల్ని ముద్రించారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. అచ్చుత‌ప్పుతో ప్రింట్ అయిన కార్డును కొంద‌రికి పంప‌టంతో.. వైట్ హౌస్ అధికారులు చేసిన త‌ప్పుపై సోష‌ల్ మీడియాలో వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తున్నారు. అచ్చు త‌ప్పుల విష‌యంలో ట్రంప్ ను ఫాలో అవుతున్నారంటూ పంచ్ లు వేస్తున్నారు.

ఆన్ లైన్ లో త‌మ త‌ప్పుపై సాగుతున్న ప్ర‌చారానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌న్న ఉద్దేశంతో వైట్ హౌస్ అధికారులు రంగంలోకి దిగారు. జ‌రిగిన త‌ప్పును వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఏం చేసినా.. జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయిన త‌ర్వాత నిద్ర లేచి హ‌డావుడి చేస్తే ఎం లాభం ఉంటుంది? ఏమైనా అచ్చు త‌ప్పుల విష‌యంలో ట్రంప్ తో వైట్ హౌస్ అధికారులు పోటీ ప‌డుతున్నారంటూ ప‌లువురు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News