తెలంగాణ వ్యాప్తంగా డిపోల వద్ద రచ్చ రచ్చ

Update: 2019-11-26 05:41 GMT
52 రోజుల పాటు తాము చేసిన సమ్మెను విరమిస్తూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే ఆర్టీసీ కార్మికులు మంగళవారం ఉదయం ఆరు గంటలకు డిపోలకు వెళ్లి.. విధులకు హాజరు కావాల్సిందిగా జేఏసీ నేతలు కోరటం తెలిసిందే. అదే సమయంలో.. ఇష్టం వచ్చినప్పుడు సమ్మె చేయటం.. విరమించుకోవటం లాంటివి సాధ్యం కావని.. సమ్మెను ఆపినప్పటికీ విధుల్లో హాజరు కావటానికి తాము ఒప్పుకోమని ఆర్టీసీ ఎండీ సోమవారం రాత్రి ప్రకటన చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ తెల్లవారుజాము నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నఆర్టీసీ డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచే ఆర్టీసీ డిపోల వద్ద భారీగా పోలీసులు మొహరించారు. జేఏసీ చెప్పినట్లుగా ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చిన కార్మికుల్ని పెద్ద ఎత్తున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

పలు ఆర్టీసీ డిపోల వద్ద డిపో మేనేజర్లు.. ఇతర సీనియర్ అధికారులు గేటు బయట వద్ద నిలబడి ఆర్టీసీ డ్రైవర్.. కండక్టర్లను గుర్తించి పోలీసులకు చెప్పటం.. గుర్తించిన వారిని గుర్తించినట్లుగా అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితులు అదుపు తప్పటంతో 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకొచ్చారు.

తాము ఆందోళన చేయటానికి రాలేదని.. విధులు నిర్వర్తించేందుకు వచ్చినట్లుగా సిబ్బంది చెప్పినా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని డిపో మేనేజర్లే తేల్చి చెప్పారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతే విదులకు అనుమతిస్తామన్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందిని ఆర్టీసీ డిపోల్లోకి అనుమతించి వారి చేత బస్సు సర్వీసుల్ని నడిపించారు. పలు జిల్లాల్లో మాత్రం బస్సుల రాకపోకలు బంద్ అయ్యాయి. మొత్తంగా ఈ రోజు తెల్లవారు జాము నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల వద్ద హడావుడి చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఉద్రిక్తతకు కారణమైంది.
Tags:    

Similar News