విలీనం డౌటే...సెల్వం గ్రూపులో చీలిక‌లు

Update: 2017-05-01 05:14 GMT
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకేలో రెండు గ్రూపులు విలీనం దిశగా వేస్తున్న అడుగులకు ఆది నుంచీ ఆటంకాలు ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో తాజాగా చోటుచేసుకున్న ప‌రిణామం అస‌లు విలీనం అవుతుందా అనే సందేహాన్ని రేకెత్తిస్తోంది. తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం గ్రూపులో విలీనంపై ఏకాభిప్రాయం లేదని, ఈ వ‌ర్గం నేత‌ల్లో చీలిక వ‌చ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి గ్రూపు ఇదే ఆరోపణ‌లు చేసింది. ఈ విబేధాల కార‌ణంగానే విలీనం ముందుకు సాగ‌డం లేద‌ని మండిప‌డింది.

తమిళనాడు ఆర్థిక మంత్రి డి.జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ చర్చలతోనే విలీనానికి పరిష్కారం దొరుకుతుందనే విషయాన్ని తాము నమ్ముతున్నట్టు తెలిపారు. అయితే పన్నీరు సెల్వం గ్రూపు చర్చలకు రాకుండా తప్పించుకుంటోందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై పన్నీరు వర్గం స్పందిస్తూ ''అమ్మ మరణంపై దర్యాప్తు, పార్టీ పదవుల నుంచి వికె శశికళ - టిటివి దినకరన్‌ - ఆయన కుటుంబసభ్యులను తొలగించడం అనే రెండు డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు సిద్ధమౌతాం'' అని స్పష్టం చేసింది.

ఇదిలాఉండ‌గా, విప‌క్ష నాయ‌కుడు డీఎంకే నేత ఎంకె స్టాలిన్‌ మరోసారి కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర నేతలను బెదిరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆదాయపు శాఖ-ఈడీ-సీబీఐ విభాగాలను తమకు అనుకూలంగా కేంద్రం వినియోగించుకుంటోందని స్టాలిన్‌ విమర్శించారు. అన్నాడీఎంకేలో ఒక గ్రూపుకు చెందిన ఇళ్లపైనే ఐటీ దాడులు చేయడం - విచారించడం - అరెస్టు చేయడం వంటివి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోందని ఆయన అన్నారు. ఇంకో గ్రూపునకు చెందిన నేతలు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలున్నప్పటికీ కళ్లు లేని పిల్లిలా వ్యవహరించడం వెనక మతలబు ఏంటో కేంద్రం వివరించాలన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేలా మోడీ జోక్యం చేసుకోవాలని ప్ర‌త్యేకంగా విడుదల చేసిన వీడియోలో ఆయన డిమాండ్‌ చేశారు. ఆ వీడియోలో హిందీ - నీట్‌ - కావేరీ వివాదం - జాలర్ల సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. నీట్‌ని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రాంతీయ భాషా సినిమాల్లో హిందీ సబ్‌ టైటిల్స్‌ తప్పనిసరి చేయాలన్న కేంద్రం నిర్ణయంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా హిందీని రుద్దొద్దని మరోమారు కేంద్రాన్ని హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News