కేంద్రమంత్రి ఆఫర్ కు నో చెప్పిన కన్నడ బోల్ట్

Update: 2020-02-18 05:15 GMT
కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో.. ఎద్దులతో పోటీ పడి పరిగెత్తి.. ప్రపంచ పరుగుల యంత్రం ఊసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కర్ణాటక భవన నిర్మాణ కూలీ కమ్ రైతు శ్రీనివాస్ గౌడ్ యావత్ దేశాన్ని ఆకర్షించారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన అతడి ప్రతిభ.. ఈ రోజు అతనికో గుర్తింపు తెచ్చి పెట్టింది.ఇదిలా ఉంటే.. ఇలాంటి వ్యక్తులకు సరైన రీతిలో శిక్షణ ఇప్పిస్తే.. ఒలింపిక్స్ లో పతకం తెచ్చే వీలుందన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది.

దీనికి తగ్గట్లే కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. శ్రీనివాస్ ను భారత క్రీడా అథారిటీ ట్రయల్ లో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. అయితే.. ఇటీవల తాను పాల్గొన్నపరుగు పందెంలో కాళ్లకు గాయాలు అయ్యాయని.. ఆ కారణంతో కేంద్రమంత్రి నుంచి వచ్చిన ఆఫర్ కు నో చెప్పేశారు. ప్రస్తుతానికి పరుగు తీయలేనని చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కంబళ మీదనే అని చెబుతున్న శ్రీనివాస్ మాటలు ఆసక్తి కరంగా మారాయి.

తనకు దున్నలతో కలిసి పరిగెత్తటమే అలవాటన్న శ్రీనివాస్.. కేంద్రమంత్రి సూచనకు పెద్దగా ఎగ్జైట్ కాలేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కంబళ అకాడమీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ గుణపాల కదంబ మాత్రం.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్య.. కంబళ కు దక్కిన గౌరవంగా చెబుతున్నారు. ఏమైనా.. బోల్ట్ కు మించిన వేగంతో దూసుకెళ్లిన శ్రీనివాస్.. శిక్షణ తీసుకొని ఒలింపిక్స లోకి అడుగు పెడితే.. బాగుంటుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News