క్రీడాకారిణుల ప‌ట్ల దారుణం.. టాయిలెట్‌లో అన్నం వ‌డ్డించారు!!

Update: 2022-09-20 11:30 GMT
కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. ఖేలో ఇండియా స్లోగ‌న్‌తో దేశంలో క్రీడ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని.. క్రీడాకారుల‌నునెత్తిన పెట్టుకుంటున్నామ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. క్రీడాకారుల‌తో క‌లిసి.. ఆయ‌న ఫొటోలు దిగుతున్నారు. వారితో క‌లిసిఐస్‌క్రీములు కూడా లాగిస్తున్నారు.

మ‌రి.. మోడీకి అత్యంత విధేయుడు.. ఆయ‌న‌కు న‌మ్మ‌క‌స్తుడు అయిన‌.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌పాల‌న‌లో మాత్రం ఈ ఖేలో ఇండియా భ్ర‌ష్టు ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క డ క్రీడాకారుల‌కు టాయిలెట్ల‌లో అన్నం పెడుతున్నారు. మ‌రి దీనిని మోడీ ఎలా స‌మ‌ర్థించుకుంటారో చూడాలి.

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్‌లో దారుణం జరిగింది. బాలికలకు అధికారులు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాట్లు చేశారు. సహరన్‌పుర్ జిల్లాలో ఈనెల 16న అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్‌ ఆటగాళ్లు ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో వంటపాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఒక చోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి పెట్టారు.

అయితే.. దీనిపై స్పందించిన అధికారులు.. ఈ దారుణాన్ని స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. స్థలం లేనందునే ఇలా చేశామని అధికారులు వివరణ ఇవ్వడం మరిన్ని విమర్శలకు దారితీసింది.

భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో వంటపాత్రలను బట్టలు మా ర్చుకునే గదిలో పెట్టాల్సి వచ్చిందని సహరన్‌పుర్‌ జిల్లా క్రీడాధికారి అనిమేశ్‌ సక్సేనా చెప్పారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణదశలో ఉందని వర్షం కారణంగా వంటపాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడం వల్ల స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న దుస్తులు మార్చుకునే గదిలో పెట్టామని సక్సేనా చెప్పారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు.. సహరన్‌పుర్ జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్‌ చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News