అన్ని కాలేజీలు మూసేస్తున్నట్లు చెప్పిన శ్రీచైతన్య.. నారాయణ

Update: 2020-02-28 05:00 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊరు ఏదైనా.. నారాయణ.. చైతన్య కాలేజీలో స్కూళ్లో గ్యారెంటీ. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యా సంస్థలకు ధీటుగా నిర్వహించే ఈ రెండు ప్రముఖ సంస్థలు తాజాగా తెలంగాణలో తమ కాలేజీల్ని మూసి వేస్తున్న విషయాన్ని వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కాలేజీలపై కన్నెర్ర చేసిన నేపథ్యంలో ఈ రెండు ప్రముఖ సంస్థలు కాలేజీల మూసివేత దిశగా నిర్ణయం తీసుకున్నాయి.

అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ ఓసీ లేకుండా కాలేజీల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అలాంటి వాటిపై కొరడా ఝుళిపించింది తెలంగాణ ప్రభుత్వం. కాలేజీ విద్యార్థుల ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టేలా ఉండే కళాశాలలపై చర్యల నేపథ్యంలో.. కోర్టుకు తాము కొన్ని కళాశాల్ని మూసివేస్తున్న వైనాన్ని వెల్లడించాయి ఈ రెండు విద్యా సంస్థలతో పాటు మరికొన్ని.

తెలంగాణలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు తగ్గట్లు లేని 68 కాలేజీలు ఉంటే.. అందులో నారాయణ సంస్థలకు చెందినవి 26 ఉంటే..శ్రీ చైతన్య కాలేజీకి చెందినవి 18 ఉన్నాయి. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పూర్తి అయ్యే వరకూ కాలేజీల్ని కంటిన్యూ చేస్తామని.. వచ్చే ఏడాది ఆడ్మిషన్లను నిర్వహించకుండా ఈ కాలేజీల్ని మూసి వేయనున్నట్లు పేర్కొన్నాయి. ఇంతకీ ఈ ప్రముఖ విద్యా సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి కారణం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

చట్ట విరుద్ధంగా కాలేజీల్ని నిర్వహిస్తున్నాయంటూ నారాయణ.. శ్రీచైతన్య కాలేజీలతో పాటు మొత్తం 68 కాలేజీలపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ కు చెందిన డి. రాజేశ్ అనే సామాన్యుడు ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.

ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యా సంస్థల్ని మూసి వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం  ఈ 68 కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ కాలేజీల్ని మూసేస్తే.. ఈ విద్యార్థుల భవిత అగమ్య గోచరంగా మారుతుందన్న ఉద్దేశం తో పరీక్షలు పూర్తి అయ్యే వరకూ ఈ కాలేజీల్ని కొనసాగిస్తారు. పరీక్షలైన వెంటనే ఈ కాలేజీల్ని మూసి వేయనున్నారు. రానున్న విద్యా సంవత్సరం లో ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు.. ఆయా సంస్థలకు చెందిన వేరే బ్రాంచ్ లలో చదువుకునే వీలుంది.
Tags:    

Similar News