వీళ్ల గొడవ ఆడోళ్ల పరువు దాకా వెళ్లింది

Update: 2017-11-04 06:31 GMT
రెండు సంస్థల మధ్య పోటీ ఉండడం సహజమే.. పోటీ ఉండడం తప్పు కాదు. కొందరు వ్యాపారం కోసం పోటీ చేస్తారు.. కొందరు పేరు కోసం పోటీ చేస్తారు.. మరికొందరు ఒకరిపై గెలవడానికి పోటీ చేస్తారు. ఇవన్నీ మనం చూస్తున్నట్టివే, రోజూ వార్తల్లోకెక్కేటివే.. కానీ రెండు విద్యాసంస్థలు వ్యాపారం కోసం పోటీ పడడం అనేది చాలా ఘోరమైనది.

శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు ఎలాంటివో మనందరికీ తెలుసు.. ప్రతి వారం ఏదో ఒక గొడవతో ఈ రెండు సంస్థలు వార్తల్లో కెక్కడం మనందరం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న నెల్లూరులో ఈ సంస్థల మధ్య జరిగిన గొడవ ఇంకా వార్తల నుంచి దిగలేదు.. ఇందులోనే ఇంకో గొడవ వార్తల్లోకెక్కింది. అసలు ఈ సంస్థల్లో పిల్లల చదువుకన్నా వాళ్ల వ్యాపారమే ముఖ్యం అని అందరికీ తెలుసు. టాప్ ర్యాంకుల(మంచి వ్యాపారం) కోసం వీళ్లు చేసే దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు.

ఒక విద్యార్థి ఆత్మాహత్యకు పాల్పడ్డాడంటే అందుకు చాలా కారణాలు ఉంటాయి.. కానీ బాగా చదివే ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే నూటికి 99శాతం వాళ్లు చదివే విద్యాసంస్థలే కారణం. అందుకే శ్రీచైతన్య, నారాయణ పాఠశాలల్లో ర్యాంకుల కన్నా ఆత్మహత్యలే ఎక్కువగా కనిపిస్తాయి.

విద్యార్థులను ప్రలోభపెట్టడం నుంచి మొదలు పెడితే వారిని హింసించడం.. వారి తల్లిదండ్రులను బెదిరించడం వరకు ఈ సంస్థలు అన్ని రకాల నీచాలకు పాల్పడ్డాయి. ‘బాగా చదివితే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి.. బాగా చదవకపోతే సెకెండ్ ర్యాంక్ కొట్టాలి’ అని ఈ సంస్థలు పెట్టే నస భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకొవడం.. అది చూసి తల్లిదండ్రులు వీళ్లపై గొడవకి రావడం.. ఈ నీచాలన్ని వీటికి సహజమైపోయాయి. ఈ దరిద్రపు పనులు చాలవంటూ కొత్తగా ఆడోళ్ల పరువును రోడ్డున లాగుతున్నాయి ఈ ‘విద్యాసంస్థలు’.

తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఆడవాళ్లకి రక్షణ లేదంటూ వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని.. వాటిల్లో వాస్తవం లేదని ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్న ఆ సంస్థలో ఎవ్వరూ ఏనాడూ యాజమాన్యం వల్ల వేధింపులకు పాల్పలేదని సునీత పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీచైతన్యలో పనిచేస్తున్న శిరీష గతంలో నారాయణ సంస్థలో పనిచేసేదని.. చైతన్య సంస్థ ఆమెను ప్రలోభపెట్టడం వల్లనే ఆమె అలాంటి ఆరోపణలు చేసిందంటున్నారు. తమ స్వార్ధాలకోసం ఓ మహిళను కించపరచడం శ్రీచైతన్య సంస్థకు తగదని హితువు పలికారు.

సంస్థలో ఉద్యోగాలకు చేరిన పాపానికి మహిళలను కూడా బజారుకీడ్చి.. వారిద్వారా శీలరక్షణ లేదని, ఉన్నదనే చౌకబారు ప్రకటనలు చేయిస్తూ ఈ సంస్థలు ఒకరి ‘బిజినెస్’ చెడగొట్టడానికి మరొకరు కుట్రలు చేయడం చూస్తోంటే చాలా నీచంగా అనిపిస్తోంది. కేవలం వ్యాపారం కోసం ఉద్యోగినులైన ఆడవాళ్లను కూడా అడ్డగోలుగా వాడుకుంటూ.. నీచానికి దిగజారే ఈ  సంస్థలు విద్యార్థులకు ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పుతాయో... ఎలాంటి విలువలను నేర్పుతాయో తల్లిదండ్రులే ఆలోచించాల్సి ఉంది. పిల్లల ప్రాణాలతో ఆటలాడుతూ.. చేసే నీచాలు తృప్తి కలిగించట్లేదని అంతకంటే నీచాలకు దిగజారిపోతున్న ‘‘విద్యాసంస్థలివి’’ అని పలువురు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News