శ్రీలంక ప్రజల నోట ఇప్పుడు వస్తున్న మాట.. ‘స్టాప్ అదానీ’

Update: 2022-06-17 09:30 GMT
దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బ తీసిన పాలకులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రజలు రోడ్ల మీదకు వచ్చిన నిరసన వ్యక్తం చేయటమే కాదు.. తమ పాలకుడు రాజపక్సేను ఉద్దేశించి 'గోగో గొటబయా' (గొటబయ రాజీనామా చేయాలి) పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి.. ప్రభుత్వాన్ని దించేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే లంకేయులు రోడ్ల మీదకు వచ్చి స్టాప్ అదానీ పేరుతో భారీ ఎత్తున నిరసన చేపడుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని కొలంబోలో వేలాది మంది లంకేయులు రోడ్ల మీదకు వచ్చి.. స్టాప్ అదానీ పేరుతో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

ఎందుకిలా? అసలేం జరిగిందంటే.. సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ ఫెర్డినాండో పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలోని అంశాలే తాజాగా పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. కమిటీకి ఇచ్చిన నివేదికకు సంబంధించిన వివరణకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. తీవ్రమైన నిరసనలకు కారణమైంది. ఆ వీడియోలో మన్నార్ పవన విద్యుత్తు ప్రాజెక్టు మీద వివరణ ఉంది.

ఎలాంటి టెండర్లు లేకుండా ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ నకు ఇవ్వాలని దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే కు చెప్పారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన నుంచి ఒత్తిడి ఉందట. అదే విషయాన్నిఆర్థిక మంత్రి నాతో చెప్పారు. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టును అదానీకి ఇప్పించేలా చేశారని పేర్కొన్నారు.

ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియో బయటకువచ్చిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు పెర్డినాండో. అంతేకాదు.. తన వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకున్నారు. అయితే..అవినీతిపై నిజాలు చెప్పిన అధికారిని ప్రభుత్వం తొలగించిందంటూ లంకేయులు ఫైర్ అయ్యారు.

స్టాప్ అదానీ అంటూ విద్యార్థులు.. మహిళలు.. సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు రోడ్లెక్కారు. అదానీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాము పవన విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని.. అవినీతికి మాత్రమే వ్యతిరేకమని ఆందోళన చేస్తున్న లంకేయులు స్పష్టం చేస్తున్నారు. టెండర్లు.. బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా అదానీకి ప్రాజెక్టును ఎలా కట్టబెడతారు? అంటూ ఆవేశంగా ప్శ్నిస్తున్నారు.

ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ అదానీ గ్రూప్ ప్రకటనను విడుదల చేసింది. తమ మీద వచ్చిన ఆరోపణ తమను నిరుత్సాహానికి గురి చేసిందని.. నిజాలేమిటన్న విషయాన్ని శ్రీలంక ప్రభుత్వానికి తాము వివరించినట్లుగా అదానీ గ్రూప్ వెల్లడించింది. అయితే.. తాజా ఎపిసోడ్ అదానీతో పాటు.. మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా చేసింది.
Tags:    

Similar News