ఇద్దరమ్మాయిల పెళ్లితో.. పోలీసులకు చెమటలు

Update: 2015-11-07 11:41 GMT

Full View
సంబంధం లేని విషయంలో ఇరుక్కొని కిందామీదా పడిపోతున్నారు నల్గొండ పోలీసులు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. ఏం చేయాలో తోచక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా పోలీసులకు చెమటలు పట్టిస్తున్న ఈ వ్యవహారం విన్న వారంతా విస్మయంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి.

అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లో.. విదేశాల్లో చాలా కామన్ అన్నట్లుగా వార్తలు చదివే యవ్వారం.. కళ్ల ముందుకు రావటం.. ఈ వ్యవహారంపై రెండు వర్గాల పెద్దలు పట్టుదలగా ఉండటం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో పోలీసులు పడిపోయారు. ఇంతకీ మ్యాటరేమిటంటే.. వదినా మరదళ్ల వరస ఉన్న ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ఒకరిమీద ఒకరు ప్రేమలో పడిపోయారు. ఇప్పటికే పెద్దల్ని కాదని ఇద్దరూ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన పెళ్లిళ్లు ఏందని అగ్రహంతో ఇద్దరిని దూరంగా పెట్టేశారు రెండు వర్గాల పెద్దలు.

ఇంతవరకూ కుటుంబాలకు మాత్రమే తెలిసిన వ్యవహారం తాజాగా రోడెక్కింది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం.. వాళ్ల ఇంటికి వచ్చిన ఆమెను చూసి ఆ ఇంట్లోవారు కొట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన  ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో తామేం చేయాలో తోచక పోలీసులకు చెమటలు పడుతున్నాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమ్మాయి శ్రీదేవి. ఇక.. వేములపల్లి మండలం రావువారిగూడెంకు చెందిన అమ్మాయి అన్నామణి. వీరిద్దరూ వరసకు వదినా.. మరదళ్లు అవుతారు. వీరి పరిచయం పెరిగి పెద్దదై.. ప్రేమకు వెళ్లి.. పెళ్లి చేసేసుకున్నారు. పెద్దలకు తెలిసి తిట్టి వారిద్దరిని వేరు చేశారు. తాజాగా అన్నామణిని చూసేందుకు శ్రీదేవి మిర్యాలగూడకు రావటంతో అన్నామణి బంధువులు శ్రీదేవి మీద దాడి చేసి కొట్టారు. చివరకు విషయం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లింది. పోలీసుల విచారణలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.

ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మాత్రం.. తామిద్దరం కలిసే ఉంటామని తెగేసి చెబుతున్నారు. సృష్టికి విరుద్ధమైన ఈ వ్యవహారాన్ని తాము ఒప్పుకోమని అమ్మాయిల తరఫు వారు స్పష్టం చేస్తున్నారు. వారిద్దరూ మేజర్లు కావటంలో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. దీంతో.. కాసేపు మంచి మాటలు చెప్పినా వారిలో మార్పు లేదు. తామిద్దరం కలిసి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో.. పోలీసులకు కూడా ఏం చేయాలో తోచక.. ఈ విషయంలోకి మరీ లోతుగా వెళితే తమకు లేని పోని ఇబ్బందులు చుట్టుకుంటాయన్న ఉన్నతాధికారుల సూచనతో ఇద్దరి అమ్మాయిల వివరాలు సేకరించి.. వారిద్దరి దగ్గర సంతకాలు తీసేసుకొని పంపించి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వ్యవహారం పోలీసుల వర్గాల్లో సంచలనంగా మారినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News