అందుకే శ్రీ‌దేవికి `ప్ర‌భుత్వ`అంత్య‌క్రియ‌లు!

Update: 2018-04-01 07:43 GMT
సినీ న‌టి శ్రీ‌దేవి ఫిబ్ర‌వ‌రి 24 వ తేదీన దుబాయ్ లోని ఓ హోట‌ల్లోని బాత్ ట‌బ్ లో మునిగి చ‌నిపోయిందని అక్క‌డి అధికారులు నిర్ధారించిన సంగ‌తి తెల‌సిందే. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 26 వ తేదీన ముంబైలో శ్రీ‌దేవి అంత్యక్రియ‌ల‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం లాంఛ‌నాల‌తో జ‌రిపించింది. అయితే, శ్రీ‌దేవికి ప్ర‌భుత్వ లాంచ‌నాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వహించ‌డంపై అప్ప‌ట్లో వివాదం చెల‌రేగింది. సెల‌బ్రిటీ అయినంత మాత్రాన శ్రీ‌దేవికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌డంపై అనిల్ గ‌ల్గ‌లి అనే సామాజిక కార్య‌క‌ర్త పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై మ‌హారాష్ట్ర స‌ర్కార్ స్పందించింది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీజ్ కు ఉన్న వివేచ‌నాధికారాల ప్ర‌కారం ప‌ద్మశ్రీ అందుకున్న శ్రీ‌దేవికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.

అనిల్ గ‌ల్గలి పిటిష‌న్ కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ సాధార‌ణ కార్య‌నిర్వ‌హ‌క విభాగం లిఖిత‌పూర్వ‌క స‌మాధాన‌మిచ్చింది. ఒక వ్య‌క్తికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే వివేచ‌నాధికారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేతుల్లో ఉంటుంద‌ని ఆ శాఖ తెలిపింది. `ప‌ద్మ శ్రీ` అవార్డు గ్ర‌హీత అయినందున కూడా శ్రీ‌దేవికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే అధికారం ఫ‌డ్న‌వీజ్ కు ఉందని తెలిపింది. అందువ‌ల్ల‌, ఫిబ్ర‌వ‌రి 25న త‌మ శాఖ‌కు శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌ల గురించి ఫ‌డ్న‌వీజ్ మౌఖిక ఆదేశాలు జారీ చేశార‌ని తెలిపింది. ముంబై స‌బ‌ర్బ‌న్ క‌లెక్ట‌ర్, ముంబై  పోలీస్ క‌మిష‌నర్ కు ఇదే విష‌యాన్నిఫిబ్ర‌వ‌రి 26న తెలియ‌జేశామ‌ని ఆ శాఖ బ‌దులిచ్చింది. గ‌డ‌చిన 6 సంవ‌త్స‌రాల‌లో మ‌హారాష్ట్ర‌లో 41 మందికి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వ‌హించామ‌ని, వారిలో ఎక్కువ మంది రాజ‌కీయ నాయ‌కులేన‌ని తెలిపింది.
Tags:    

Similar News