ఇంగ్లీష్ రాకుంటే ఎంత ఇబ్బందో..ఈ ఎమ్మెల్యే చెప్పేశారు

Update: 2019-12-12 17:09 GMT
ఇంగ్లీష్ మీడియంపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెడుతూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం దరిమిలా ఈ చర్చ ఓ రేంజిలో నడుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయి.. సభను కుదిపేసిందనే చెప్పాలి. ఓ వైపు ఆంగ్ల మాద్యమంపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష టీడీపీ... ఆంగ్ల మాద్యమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ స్పీచ్ లు దంచేయక తప్పడం లేదు. ఇలాంటి హాట్ హాట్ డీబేట్ లో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన ప్రసంగం... అసెంబ్లీని నవ్వుల్లో ముంచేసింది. బియ్యపు నోట నుంచి వచ్చిన బట్టర్ ఇంగ్లీష్... అసెంబ్లీతో పాటు అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అతుక్కుపోయిన ఏపీ ప్రజలను కూడా కడుపుబ్బా నవ్వించేసిందని చెప్పాలి.

అయినా ఇంగ్లీష్ ప్రాధాన్యం గురించి వివరిస్తూ... ఇంగ్లీష్ పై అంతగా పట్టు లేని తాను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్న కోణంలో మధుసూదన్ రెడ్డి చేసిన ప్రసంగం నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా పర్యటనకు వెళితే.. జగన్ వెంట మధుసూదన్ రెడ్డి కూడా వెళ్లారట. అమెరికా పర్యటన అంటే... ఆంగ్లంలో మాట్లాడలేని వైనం కాస్తంత ఇబ్బంది పెట్టేదే కదా. ఇంగ్లీష్ అంతగా రాని మధుసూదన్ రెడ్డి కూడా అమెరికాలో నానా ఇబ్బందులు పడ్డారట. ఆ ఇబ్బందులను సభలో ఏకరువు పెట్టిన మధుసూదన్ రెడ్డి... అసెంబ్లీలోనూ అదే బట్టర్ ఇంగ్లీష్ తో ప్రసంగించి కడుపుబ్బా నవ్వించారు. మధుసూదన్ రెడ్డి నోట నుంచి వచ్చిన సదరు బట్టర్ ఇంగ్లీష్ తో సీఎం జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు... అంతా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు.

అమెరికాలో అడుగుపెట్టగానే... అక్కడి అధికారులు మధుసూదన్ రెడ్డిని ఆపేశారట. అమెరికాకు ఎందుకు వచ్చారంటూ అక్కడి సెక్యూరిటీ అధికారులు ప్రశ్నిస్తే... ఇంగ్లీష్ లో ప్రావీణ్యం లేని మధుసూదన్ రెడ్డి... ‘ బిగ్ మీటింగ్... గ్యాదరింగ్... సార్ ఐయామ్ గోయింగ్ టూ మీటింగ్ సార్’ అని చెప్పారట. అయితే మధుసూదన్ రెడ్డి నోట నుంచి వచ్చిన ఆ బట్టర్ ఇంగ్లీష్ అర్థం కాని అమెరికా పోలీసులు ఆయనను ఎత్తుకుని ఓ మూలన కూర్చోబెట్టారట. అంతేకాకుండా రెండు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారట. అసలే అంతంత మాత్రం ఇంగ్లీష్... అందులోనూ బట్టర్ ఇంగ్లీష్ మాత్రమే వచ్చే మధుసూదన్ రెడ్డి వారి ప్రశ్నలతో బిత్తరపోయారట. ఈ ప్రశ్నల వర్షం ఇలా సాగుతుండగానే... వాసుదేవ రెడ్డి అనే ప్రవాసాంధ్ర ప్రముఖుడు అక్కడికి వచ్చి... మధుసూదన్ రెడ్డి గురించి అమెరికా పోలీసులకు చెప్పడంతో వారు ఆయనను విడిచిపెట్టారట. మొత్తంగా ఇంగ్లీష్ రాని తాను అమెరికాలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న విషయాన్ని తనదైన బట్టర్ ఇంగ్లీష్ లో వివరించిన మధుసూదన్ రెడ్డి అందరినీ కడుపుబ్బా నవ్వించేశారు.

    

Tags:    

Similar News