ఓపెనింగ్ చేసుకోవటం కూడా తప్పేనా శ్రీకాంత్ రెడ్డి?

Update: 2016-06-29 16:32 GMT
అరుదుగా లభించే అవకాశాల్ని పూర్తిగా వాడుకోవాలనుకోవటం  తప్పేం కాదు. విభజన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర రాజధానిని  నిర్మించే అద్భుత అవకాశం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కింది. రాజధాని లాంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని వీలైనంత వైభవంగా జరుపుకోవటం మామూలే. ఒక సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే.. శంకుస్థాపన మొదలు.. ఇంటి గుమ్మం పెట్టేటప్పుడు ఒకసారి.. స్లాబు వేసేటప్పుడు ఒకసారి.. గృహప్రవేశానికి ఇంకోసారి పూజలు.. ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. ఇక.. కాస్త డబ్బున్నోళ్లు అయితే.. తాము ఇంట్లోకి చేరి.. సెటిల్ అయ్యాక ముఖ్యమైన బంధువుల్ని.. స్నేహితుల్ని పిలిచి ఇంటిని చూపిస్తూ పార్టీ ఇవ్వటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది.

అలాంటప్పుడు ఏపీ రాజధానికి సంబంధించి కీలకమైన కార్యక్రమాన్ని నిర్వహించటం తప్పన్నట్లుగా జగన్ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రికార్డు స్థాయిలో కేవలం 121 రోజుల వ్యవధిలో తాత్కాలిక సచివాలయ భవనాన్ని తయారు చేయటం.. అందులోని గ్రౌండ్ ఫ్లోర్ ను పూర్తి చేసి.. నాలుగు మంత్రిత్వ శాఖల్ని అందులో గృహప్రవేశం చేయింటం ఒక పెద్ద కార్యక్రమంగా ఏపీ సర్కారు చేపట్టింది. దీన్ని శ్రీకాంత్ రెడ్డి ఎటకారం చేయటం గమనార్హం. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలి రావటం ఒక చారిత్రక కార్యక్రమం. ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. మరి.. అలాంటి కార్యక్రమాన్ని పట్టుకొని.. ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారంటూ ప్రశ్నించటం చూస్తే.. శ్రీకాంత్ రెడ్డి అక్కసు ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.

200 ఏళ్లు దేశాన్ని పాలించిన బ్రిటీషర్లు కూడా ఇంత హడావుడి చేయటం లేదంటున్న శ్రీకాంత్ రెడ్డి తీరు చూస్తుంటే.. ముఖ్యమైన కార్యక్రమాల్ని మూడో కంటికి తెలీకుండా.. మమ అనిపిస్తే సరిపోతుందన్నట్లుగా ఉంది. ఏపీ ప్రజల మనసుల్ని దోచుకోవాలంటే ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు చేసే బదులు.. వారి మనసుకు నచ్చే అంశాలపై పోరాడితే కాస్త ఫలితం ఉంటుందన్న విషయం శ్రీకాంత్ రెడ్డి లాంటి వారికి ఎప్పుడు అర్థమవుతాయో..?
Tags:    

Similar News