అమరావతిని అడ్డుకోవటానికీ విరాళాలా?

Update: 2016-02-28 04:58 GMT
ఇలాంటి చోద్యాలన్నీ ఏపీలోనే జరుగుతాయేమో. ఒకపక్క ఏపీ ప్రజల కలల పంటగా అభివర్ణిస్తున్న రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం ఏపీ సర్కారు విరాళాలు సేకరిస్తుంటే.. మరోవైపు అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవటానికి సైతం విరాళాలు ఇవ్వాలంటూ ప్రచారం మొదలు కావటం గమనార్హం. ఆంధ్రులకు రాజధాని లేని లోటును తీర్చుకోవటంతో పాటు.. ప్రపంచస్థాయి నగర నిర్మాణం అత్యవసరమన్న భావన పలువురు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంపై అటు ప్రజలు.. ఇటు రాజకీయ పార్టీలు సైతం పెద్దగా వ్యతిరేకించకున్నా.. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందాం అంటూ బెజవాడకు చెందిన పందళనేని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే.

ఇప్పటికే న్యాయస్థానాల్ని ఆశ్రయించిన అతగాడికిక అక్కడ ఎదురుదెబ్బలు తగలంతో ఆ మధ్యన.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీమన్నారాయణ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవటానికి తన దగ్గర డబ్బులు లేవని.. తాను చేస్తున్న న్యాయపోరాటానికి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాడు.

ప్రజలంతా ఎంతో ఆశగా అమరావతి నిర్మాణం కోసం ఎదురుచూస్తుంటే.. అందుకు భిన్నంగా శ్రీమన్నారాయణ లాంటి వాళ్లు విరాళాల పేరుతో బయటకు రావటంపై అతడి వ్యవహారాలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. మరోవైపు ఏపీ సర్కారు సైతం ఈ విరాళాల సేకరణ ప్రకటనపై సీరియస్ గా ఉంది.

తామెంతో ప్రతిష్ఠాత్మకంగా అమరావతి నిర్మాణం కోసం ప్రయత్నిస్తుంటే.. దాన్ని అడ్డుకోవటం కోసం బహిరంగంగా విరాళాలు సేకరించటం ఏమిటన్న అంశంతో పాటు.. శ్రీమన్నారాయణ వెనుక ఎవరున్నారు? ఇప్పటికే ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్న రూ.53 లక్షల లెక్క ఏమిటి? అన్న విషయాలతో పాటు.. అమరావతి వ్యతిరేకంగా తాను షురూ చేసిన విరాళాల ప్రక్రియకు రూ.1.70లక్షలు వచ్చినట్లుగా చెబుతున్న అంశంపైనా? ఆ విరాళాలు అందించిన  వారిపైన ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఓపక్క నిర్మాణానికి చంద్రబాబు సర్కారు విరాళాలు అడుగుతుంటే.. మరోవైపు దాన్ని అడ్డుకునేందుకు ప్రైవేటు వ్యక్తి విరాళాలు సేకరించటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News