మ‌హ‌నీయులను మలినం చేస్తారా?

Update: 2015-08-30 04:33 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యం మ‌రోమారు ఇరు రాష్ర్టాల్లోనూ ఆవేశాల‌కు, రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌కు దారితీస్తోంది.  పాఠ్యాంశాల్లో నుంచి తెలంగాణ చరిత్ర, సంస్కృతిని తొలగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై రాజ‌కీయ పార్టీల నాయ‌కులు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టారు. అయితే ఈ క్ర‌మంలో మ‌హ‌నీయుల‌ను సైతం లాగ‌డం తెలుగు అభిమానుల‌కు ఒకింత ఆవేదనను మిగులుస్తోంది.

ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్రంగా మండిప‌డ్డారు. తెలంగాణ చరిత్ర  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు అవసరం లేనప్పుడు మా రాష్ట్రంలో వారి చరిత్ర ఎందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు. టాంక్‌ బండ్‌ పై ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు, రాష్ర్టంలోని వివిధ సిగ్న‌ల్ల వ‌ద్ద ఉన్న నేతల విగ్రహాలన్నీ ఉచితంగా లారీ ల్లో వేసి పంపిస్తాం..అక్కడే ప్రతిష్ఠించుకోండి అంటూ మండిప‌డ్డారు. దీంతోపాటు హైదరాబాద్‌ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి పార్క్‌ - సంజీవయ్య పార్క్‌ - కేబీఆర్‌ పార్క్‌ - జీఎంసీ బాలయోగి స్టేడియం - ఎన్టీఆర్‌ స్టేడియం - ఏఎస్‌రావు నగర్‌ కాలనీ.. ఇలా ఆయా సంస్థలకు, పార్కులకు ఆంధ్రా నాయకుల పేర్లు పెట్టుకున్నారని, ఇదేమైన వారి జాగీరా ? అని నిప్పులు చెరిగారు. వాటన్నింటికి ఆంధ్రా నాయకుల పేర్లు తొలగిస్తామన్నారు.

అయితే ఆంధ్రప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం తొంద‌ర‌పాటులోనో లేదా అధికారుల అత్యుత్సాహంతోనే చేసిన ప‌నికి న‌గ‌రంలోని మ‌హ‌నీయుల విగ్ర‌హాలు తొల‌గిస్తారా? గ‌తంలో సాగ‌ర‌హారం సంద‌ర్భంగా ట్యాంక్‌ బండ్ విగ్ర‌హాల‌ను కూల్చ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆ విష‌యమై నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు గంభీర ఉప‌న్యాసాలు ఇచ్చారు. ఏపీలో విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టిస్తామ‌ని చంద్ర‌బాబు సైతం ఆనాడు వ్యాఖ్యానించారు. ఇపుడు చ‌రిత్ర పాఠ్యాంశాల‌తో ర‌చ్చ‌కు శ్రీ‌కారం చుట్టిన ఆంధ్రాపాల‌కులు, దాన్ని ప‌ట్టుకొని తెలంగాణ‌వాదులు వైతాళికుల విగ్ర‌హాల‌ను త‌ర‌లించివేయ‌డం అనేది.. ఫ‌క్తురాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సాగుతున్న ఎత్తుగ‌డ‌ల‌ను త‌ల‌పిస్తోంది.
Tags:    

Similar News