అధికారుల్ని ఈ తిట్టుడేంది శ్రీనివాస్ గౌడ్?

Update: 2015-10-28 06:01 GMT
ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఉద్యోగ సంఘాల నాయకుడిగా మారి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మనసు దోచుకున్ననేత శ్రీనివాస్ గౌడ్. ఈ కారణంతోనే తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రకు ఫలితంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున టిక్కెట్టు ఇచ్చి గెలిపించుకున్నారు. దీంతో.. అప్పటివరకూ ఉద్యోగ నేతగా.. తెలంగాణ ఉద్యమ నేతగా మాత్రమే తెలిసిన శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా అవతరించారు. మూడ్ బాగున్నప్పుడు అలవోకగా వరాలు ఇచ్చే కేసీఆర్ తీరుతో.. మంత్రి పదవి శ్రీనివాస్ గౌడ్ ఆశలు పెంచుకున్నారు.

అయితే.. అన్ని వరాలు వాస్తవ రూపం దాల్చవన్న నీతిని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న శ్రీనివాస్ గౌడ్.. తన కోరికను తీర్చుకోవటానికి మాటల దాడి అప్షన్ ను ఎంచుకున్నారు. కాకుంటే.. ఇలాంటి విధానం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం ఉండదని తెలిసి కూడా.. ఆయన వెనక్కి తగ్గటం లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా తన మాటలతో మీడియాకు ఎక్కుతున్న శ్రీనివాస్ గౌడ్ తాజాగా మరోసారి మీడియాలోకి వచ్చారు.

తెలంగాణ సర్కారు మీద నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయని ఆయన.. అధికారుల పని తీరును తీవ్రస్థాయిలో తప్పు పడుతుంటారు. కల్లు వృత్తిదారుల్ని ప్రభుత్వానికి దూరం చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నాంటూ మండిపడ్డారు. కుట్రతో వ్యవహరిస్తూ తెలంగాణ సర్కారు ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నారని వాపోయారు. ఓ పక్క అధికారుల మీద ఫైర్ అయిన శ్రీనివాస్ గౌడ్ తన ‘‘సొంత బాధ’’ను కూడా చెప్పుకున్నారు. బలహీన వర్గాలకు తాను అండగా ఉండటమే నేరంగా చిత్రీకరించి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. వారి కుట్రల్ని చేధిస్తామన్నారు.

కుల వృత్తులను కాపాడుకోవటానికి తన ప్రాణాల్ని సైతం పణంగా పెడతానని శ్రీనివాస్ గౌడ్ చెప్పటం బాగానే ఉన్నా.. సామాజిక.. ఆర్థిక.. రాజకీయ రంగాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరతానంటూ బహిరంగంగా చెప్పిన మాటలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ మైండ్ సెట్ తెలిసి కూడా.. ఆయనను నొప్పించేలా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం.. పరోక్షంగా ప్రభుత్వాన్ని తప్పు పట్టటం కిందనే వస్తుందన్న చిన్న లాజిక్ శ్రీనివాస్ గౌడ్ ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ నేతగానే ఆయన మాట్లాడుతున్నారని.. ఆయనిప్పుడు రాజకీయ నేత అన్న విషయం మర్చిపోతున్నారంటూ అధికారపక్ష నేతలే గొణగటం గమనార్హం..

Full View
Tags:    

Similar News