శ్రీ‌నివాస్ కూచిబొట్ల హ‌త్య‌లో..షాకింగ్ ట్విస్ట్‌

Update: 2017-12-02 17:17 GMT
కొద్దికాలం క్రితం జాత్యహంకార హ‌త్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారి...ఇటు అమెరిక‌న్ల‌కు అటు వ‌ల‌స వ‌చ్చిన వారికి భ‌య‌కంపితుల కేంద్ర‌మైన అమెరికాలో జ‌రిగిన మ‌నోడి హ‌త్య ఉదంతం మ‌రో మ‌లుపు తిరిగింది. అమెరికాలో తెలుగు సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల(32) హత్యకేసులో నిందితుడు ఆడం ప్యూరింటన్‌(52) తాను తప్పు చేశానన్న భావనను వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాన్సాస్‌ పట్టణంలోని ఒక బార్‌ లో ప్యూరింటన్‌ అనే మాజీ నేవీ ఉద్యోగి శ్రీనివాస్‌ ను జాతిపరమైన వివక్షతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రాథమిక విచారణ శుక్రవారం జరిగింది. ఈ సంద‌ర్భంగా ప్యూరింట‌న్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు.

విదేశీయులు అమెరికాలోని ఉద్యోగావకాశాలను కొల్లగొడుతున్నారన్న జాతివిద్వేష ప్రచారంతో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన కొత్తలో అమెరికాలో భారతీయులపై పలు చోట్ల దాడులు జరిగాయి.‘మీరు మా దేశం నుంచి వెళ్లిపోండి’ అని అరుస్తూ ప్యూరింటన్‌ గొడవకు దిగి శ్రీనివాస్‌ ను తుపాకీతో కాల్పి చంపాడు. జాత్యాంహ‌కార దాడి - మార‌ణాయుధాలు క‌లిగి ఉండటం అనే  అభియోగాలు పురింట‌న్‌ పై న‌మోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న‌ను జాతి వివ‌క్ష దాడిగా విచార‌ణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అలోక్‌ మేడసాని అనే మరో భారతీయ యువకుడిని కూడా హత్య చేయాలని చూశాడని, ఈ దాడిని అడ్డుకోబోయిన ఒక శ్వేతజాతీయుడిని కూడా గాయపరిచాడని కేసు విచారణ సందర్భంగా ఫెడరల్‌  ప్రాసిక్యూటర్లు కోర్డుకు తెలిపారు. అయితే తాను ఎలాంటి నేరం చేయలేదని ప్యూరింటన్ పేర్కొంటూ పిటిష‌న్‌ కోర్టులో దాఖ‌లు చేశారు.

కాగా, కాల్పులు జరిపిన తరువాత ప్యూరింటన్‌ అక్కడికి 70 కిలోమీటర్ల‌ దూరంలో ఉన్న  మిస్సోరీలోని ఆపిల్‌ బీ రెస్టారెంట్‌ కు వెళ్లి అక్కడి బార్‌ టెండర్‌ కు తాను చేసిన దాడి గురించి చెప్పాడు. ప్యూరింటన్‌ పై ఉద్దేశ పూర్వక దాడి, హత్య - హత్యాయత్నం అభియోగాలు దాఖలయ్యాయి. అభియోగాలు రుజువైతే ప్యూరింటన్‌ కు మరణశిక్ష లేదా, జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది మే8కి వాయిదా పడింది. శ్రీనివాస్‌ అమెరికాలోని గార్మిన్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు..

కాగా, దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలకు ఆ దేశం న్యాయం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమెకు తాత్కాలిక వర్క్ వీసాను మంజూరు చేసింది. శ్రీనివాస్ హత్య తర్వాత అంత్యక్రియల కోసం ఆమె భారత్‌ కు రావడంతో సునయన అమెరికాలో నివాస హక్కును కోల్పోయారు. తాను అమెరికాలో ఉండటానికి, అక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆమె ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వర్క్ వీసా మంజూరు కోసం ఆ దేశానికి చెందిన ఎంపీ యోడర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. చివరికి సునయనకు వర్క్ వీసా మంజూరయ్యేలా చూశారు.
Tags:    

Similar News