కేటీఆర్ ను శ్రీనివాస్ పేరెంట్స్ ఏం అడిగారంటే?

Update: 2017-02-26 05:56 GMT
తలకెక్కిన జాత్యాంహకారంతో శ్రీనివాస్ కూఛిబొట్లను కాల్చి చంపిన ఉదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. చేయని తప్పునకు అన్యాయంగా బలైన తమ కుమారుడి హత్యోదంతం గురించి విన్న శ్రీనివాస్ తల్లిదండ్రులు శోకంతో తల్లడిల్లిపోతున్నారు. వారిని ఊరడించేందుకు.. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న విషయాన్ని తెలియజెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్వయంగా శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఉద్యోగాల కోసం భారతీయులు ప్రత్యామ్నాయం చేసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా కాకుంటే మరో దేశం వైపు దృష్టి సారించాలే కానీ.. ప్రాణాంతకమైన ప్రాంతాల్లో భయపడుతూ జీవించొద్దన్న సూచన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని ఆదుకుంటామని ఆయన చెప్పారు.

తీవ్ర విషాదంలో నిండిపోయిన శ్రీనివాస్ తల్లిదండ్రుల్ని ఊరడించే ప్రయత్నం చేసిన కేటీఆర్ తో.. వారు ఒక వ్యాఖ్య చేశారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అక్కర్లేదని.. అయితే.. తమ కొడుకు మాదిరి అమెరికాలో ఉంటున్న వారికి తగిన భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం భరోసా కల్పించాలని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న తెలుగు వారికి భద్రత కరువైందని.. తమ కుటుంబం అనుభవిస్తున్న క్షోభ మరెవరూ పడకుండా చూడాలని కోరారు. కొడుకు పోయిన పుట్టెడు శోకంలో ఉన్న వేళ.. ప్రభుత్వం నుంచి సాయం గురించి ఆలోచించకుండా.. తమ కొడుకు మాదిరి ఎవరూ బలి కాకూడదన్న భావనలో ఉండటమే కాదు.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పిన వైనానికి తెలంగాణ పాలకుల ప్రయత్నాలు ఎలా ఉంటాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News