కేసీఆర్ కాదు..కేటీఆర్ సీఎంగా రావాల‌ట‌!

Update: 2018-12-23 05:12 GMT
తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంలోకి కొత్త సీన్లు వ‌చ్చేస్తున్నాయి. తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో కేసీఆర్.. కేటీఆర్‌ లు తిరుగులేని అధికార కేంద్రాలుగా మారిన సంగ‌తి తెలిసిందే. జాతీయ రాజ‌కీయాల మీద కేసీఆర్ దృష్టి పెట్ట‌ట‌మే కాదు.. ఈ రోజు నుంచి మూడు.. నాలుగు రోజులు ఏపీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

జాతీయ రాజ‌కీయాల మీద సారు ఫోక‌స్ చేసిన నేప‌థ్యంలో.. కేటీఆర్ వీర భ‌క్తుల‌కు ఇప్పుడో అద్భుత అవ‌కాశం వ‌చ్చేసింది. కేటీఆర్‌ పై త‌మ‌కున్న ప్రేమాభిమానాల్ని ప్ర‌ద‌ర్శించేందుకు వీలుగా వారిప్పుడు కొత్త స్లోగ‌న్ అందుకోనున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తొలుత గ‌ళాన్ని వినిపించిన క్రెడిట్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్‌ కు ద‌క్కింద‌ని చెప్పాలి.

ఉద్యోగ సంఘాల నాయ‌కుడిగా మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం రెండోసారి ఎమ్మెల్యేగా ఆయ‌న ఎన్నిక కావ‌టం తెలిసిందే. తాజాగా మాట్లాడిన ఆయ‌న‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆద్యుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మారార‌ని..తెలంగాణ రాష్ట్రంలో ఆయ‌న అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు దేశ వ్యాప్తంగా అమ‌లు కావాలంటే ఆయ‌న జాతీయ రాజకీయాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించాల‌న్నారు.

మ‌రి.. కేసీఆర్ ఢిల్లీ మీద ఫోక‌స్ చేస్తే.. రాష్ట్రం సంగ‌తేమిటి? అన్న ప్ర‌శ్న రావ‌టానికి ముందే శ్రీ‌నివాస్ గౌడ్ సొల్యూష‌న్ చెప్పేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌లైన వేళ‌.. తెలంగాణ రాష్ట్ర బాధ్య‌త‌ల్ని యువ‌నేత కేటీఆర్‌ కు క్రియా శీల‌క పాత్ర‌ను పోషించేలా చేయాలంటున్నారు.

దాని అర్థం ఏమిట‌న్న ఆలోచ‌న చేయ‌టానికి ముందే.. త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశారు శ్రీ‌నివాస్ గౌడ్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేటీఆర్‌ ను చేయాల‌ని ఆయ‌న చెప్పారు. తాజాగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ బూత్ లెవ‌ల్ క‌మిటీ స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌న్న మాట‌ను ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశారు. చూస్తుంటే.. కేటీఆర్ అర‌వీర విధేయులంతా క‌లిసి త‌మ యువ నాయ‌కుడికి సీఎం కుర్చీని క‌ట్ట‌బెట్టాల‌న్న మాట‌ను ఉద్య‌మంలా మార్చే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

Tags:    

Similar News