ఎలుక వల్ల ఆ కంపెనీకి రూ.కోటి నష్టం..ఏం జరిగిందో తెలుసా...?

Update: 2020-08-21 04:15 GMT
ఎలుక చేసిన పనికి ఒక కంపెనీకి ఏకంగా రూ.కోటి నష్టం వాటిల్లింది. అంతలా ఎలుక  చేసిందేమిటి అని ఆశ్చర్యపోతున్నారా..అది   చేసిన పని ఆ కంపెనీ వాళ్లే గుర్తించలేకపోయారు. చివరికి ఆరు నెలల తర్వాత ఎలుక కారణంగా  కోటి రూపాయలు నష్టపోయినట్టు వాళ్లకు నిజం తెలిసింది. ఓ ఎలుక కంపెనీకి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధం అయి భారీగా నష్టం వాటిల్లింది. అయితే ముందు అది షార్ట్ సర్క్యూట్ అని అనుకున్నా ఆ తర్వాత ఎలుక చేసిన పనికి అంత పని జరిగినట్లు గుర్తించారు. సీసీ టీవీ పుటేజ్ ద్వారానే ఈ విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి ఎలుక ఏంటి ఇంత పని చేయడం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

 ముషీరాబాద్‌ లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌ లో ఈ ఏడాది ఫిబ్రవరి 8న భారీ అగ్నిప్రమాదం  జరిగింది. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆఫీస్ లోని  ఫర్నీచర్ తో పాటు మూడు కార్లు కూడా  తగలబడి పోయాయి. రూ.కోటికి పైనా నష్టం జరిగినట్లు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు షార్ట్ సర్క్యూట్  ప్రమాదానికి కారణమని తేల్చారు. ఆ తర్వాత ఆ కేసును మూసివేసేశారు. అయితే ఆ కంపెనీకి అప్పటికీ అనుమానం తీరక పోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందు కోసం ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థను ఆశ్రయించింది. వారు ప్రమాదం జరిగిన  రోజు రాత్రి సీసీటీవీని క్షుణ్ణంగా పరీశీలించగా అసలు విషయం బయటపడింది.

ఫిబ్రవరి 7న ఉదయం అందరూ విధులకు హాజరయ్యారు. రోజులాగే ఓ ఉద్యోగి  ఆఫీసు రాగానే పూజ చేసి దీపం పెట్టాడు. అనంతరం తన పనిలో నిమగ్నమయ్యాడు. సాయంత్రం పనులు  ముగియగానే అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. అయితే ఉదయం వెలిగించిన దీపం రాత్రి  వరకు వెలుగుతూనే ఉంది. అర్ధరాత్రి ఓ ఎలుక దీపం ముట్టించి చోటుకు  వెళ్లి మండుతున్న దీపపు వత్తిని లాక్కొని వచ్చి ఓ చైర్ పై పడేసింది. ఆ తర్వాత కాసేపటికి చైర్ నుంచి  మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బిల్డింగ్ మొత్తం వ్యాపించి రిపేరు కోసం వచ్చిన వాహనాలు సహా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.కోటి  నష్టం వాటిల్లింది.ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ ఆరు నెలల తర్వాత ఎలుక కారణంగానే ప్రమాదం జరిగినట్టు కనుగొనింది. ఎలుక వల్ల  అంత పెద్ద ప్రమాదం జరగడం పై అంతా ఆశ్చర్యపోతున్నారు.
Tags:    

Similar News