స్టాలిన్ వర్సెస్ బెంగాల్ గవర్నర్.. దీదీకి అండగా తమిళనాడు సీఎం

Update: 2022-02-14 05:46 GMT
రాజకీయ విభేదాలు రాష్ట్రాల సరిహద్దుల్ని దాటేస్తున్నాయి. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రికి.. గవర్నర్ కు మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపటం.. ఇరువురు ఎడముఖం.. పెడ ముఖం అన్నట్లుగా ఉండటం తెలిసిందే.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని రీతిలో సరికొత్త రాజకీయ సన్నివేశం తాజాగా చోటుచేసుకుంది. గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్లు ఉండే రాష్ట్రాల్లో తరచూ వార్తల్లో నిలిచే రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ను చెప్పాలి.

అక్కడి గవర్నర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతకు మధ్య తరచూ ఏదో ఒక లొల్లి నడుస్తూ ఉంటుంది. తాజాగా ఈ లొల్లి బెంగాల్ కు సదూరాన ఉన్న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం తప్పు పట్టే పరిస్థితి చోటు చేసుకుంది.

దీనికి కారణం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ సెషన్ ను ఆ రాష్ట్ర గవర్నర్ ప్రోరోగ్ చేసిన వైనంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పు పడుతూ ట్వీట్లు చేశారు.

అసలు ఆ అధికారం గవర్నర్ కు లేదన్న ఆయన.. ఇలా చేయటం నిబందనలకు.. సంప్రదాయాలకు విరుద్దమని పేర్కొన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని సుస్థిరం చేయటంలో ఆదర్శప్రాయంగా ఉండాలన్న ఆయన.. ఈ వివాదంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీకి బాసటగా నిలిచారు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన ట్వీట్ కు బెంగాల్ గవర్నర్ ఘాటుగా రియాక్టు అయ్యారు. వాస్తవాల గురించి తెలుసుకోకకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్ ట్వీట్ కు బదులిచ్చారు.

సీఎం మమత అభ్యర్థన మేరకే రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే.. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయ జట్టుకు సంబంధించి కొత్త కూటమికి బలమైన బీజాలు పడుతున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News